భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. అదిగో పులి ఇదిగో జాడ అన్నట్లు గత నాలుగు రోజులుగా సమీప గ్రామాలు ప్రజలను టెన్షన్ పెడుతోంది. కరక గూడెం మండలం రఘునాథ పాలెం అడవుల్లో పెద్ద పులి సంచారంతో అటవీ శాఖ అధికారులు పులి పాద ముద్రలు గుర్తించారు. ములుగు జిల్లా నుంచి సరిహద్దు భద్రాద్రి ఏజెన్సీలోకి వచ్చినట్లు రైతులు, ప్రజలు ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీలో పెద్ద పులి సంచారంతో సమీప గ్రామాలు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లా అడవుల నుండి సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో ప్రవేశించిన పెద్దపులి స్థానికులను కలవర పెడుతుంది. కరకగూడెం గుండాల ఆళ్లపల్లి అడవుల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. కరకగూడెం మండలం రఘునాధపాలెం అడవులలో కట్టెలకు వెళ్లిన గిరిజనులకు పులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో భయంతో అడవి నుండి బయటకు వచ్చిన గిరిజనులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే పులి ఆనవాళ్ళ కోసం అన్వేషిస్తున్న అటవీశాఖ అధికారులు దానిని నిర్ధారించేందుకు అడవుల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెద్ద పులి కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లోనే సంచరిస్తుందని సమీప గ్రామాల ప్రజలు ఎవరూ కూడా పెద్దపులికి ఎటువంటి హాని కలిగించవద్దని, పశువులను అడవులకు తీసుకువెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. పెద్దపులికి హాని కలిగించే పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే సమయంలో ఇక్కడ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది. మనుషులుపై దాడి చేయడం, చంపడం వంటివి పులి ఇప్పటి వరకు చేయలేదు. కరకగూడెం మండలం పంగల్ వాగులో పెద్ద పులి పాద ముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. గొల్ల గూడెం, చిరుమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులి జాడ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ములుగు జిల్లా వాజేడు, అటవీ ప్రాంతం అక్కడ నుంచి సరిహద్దు భద్రాద్రి ఏజెన్సీ లోకి ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆడపులి బీట్ ( ఎద ) కోసం సంచరిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, వారికి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. పులి దాడిలో పశువులు చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లుస్తుందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి