ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను టైగర్ టెన్షన్ వీడటం లేదు. గతంలో ఉన్న రెండు పులులు కాస్తా..తర్వాత నాలుగయ్యాయి అయ్యాయి. ఆ నాలుగు కాస్తా ఇప్పుడు 11 పులులు అయ్యాయి. కొమురంభీం- మంచిర్యాల సరిహద్దుల్లో మొత్తం 11 పులులు సంచరిస్తుండటంతో.. ఇదిగో టైగర్.. అదిగో పెద్దపులి అనే హెచ్చరికలతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. పులుల సంచారంతో రోజువారీ పనులకు కోసం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.. అటవీ సమీప గ్రామాల ప్రజలు. కొమురంభీం- మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో మొత్తం 11 పులుల సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెబుతున్నారు..
ఏటా చలికాలంలో ఇక్కడికి తోడు కోసం వస్తూ అడవుల్లో సంచరిస్తున్నాయి పులులు. తాజాగా ఎర్రగుంట గ్రామ శివారులో పులి కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. బొంబాయిగూడ గ్రామ శివారులోని ఉచ్చమల్ల వాగుతో పాటు సమీప పంట చేనుల్లో పులి పాదముద్రలను చూశారు మేకలకాపరులు. అటు మంచిర్యాల జిల్లా ముల్కల్ల బీట్ పరిధిలోను మరో ఆడపులి సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. ముల్కల్ల బీట్ సఫారీ రోడ్‌పై ట్రాప్ కెమెరాల కంటపడింది మరో ఆడ పులి. మంచిర్యాల జిల్లాలోనే మగపులి కూడా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. మందమర్రి, అందుగుల పేట, తాండూరు మండలం నీలాయపల్లి సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది.
పులల సంచారంతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు..స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. బైక్‌లపై తిరుగుతూ గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. మరోవైపు పొలాల్లో పనిచేస్తున్నవారిపై వెనకనుండి పులి దాడిచేయకుండా.. వారికి మాస్క్‌లు పెడుతున్నారు.
జిల్లాను ఓ వైపు పులి భయం వెంటాడుతుంటే.. మరోవైపు అదే పులిపై పంచాయితీ మొదలయింది.. పులి సంచారం పేరుతో గిరిజనులను పోడు భూములకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు సిర్పూరు ఎమ్మెల్యే హరీష్‌బాబు.. కాగజ్‌నగర్‌ను టైగర్ జోన్ చేయాలన్న ఆలోచనలను అటవీశాఖ విరమించుకోవాలని హెచ్చరికలు చేశారు ఎమ్మెల్యే.. ప్రజాభిప్రాయం లేకుండా టైగర్ జోన్ ఏర్పాటు చేస్తారా? పులి నుండి మనుషులను..మనుషుల నుండి పులులను రక్షించలేరా? అంటూ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..