
రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ’ (TGSRTC) కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. బస్ స్టేషన్లలో రద్దీ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు, ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు సంస్థ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసింది.ప్రయాణీకులకు సౌకర్యాలను మెరుగుపరచడం, బస్ స్టేషన్ల నిర్వహణను బలోపేతం చేయడం, ప్రయాణీకుల రాకపోకలు సజావుగా సాగేలా చూడటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన బస్ స్టేషన్లలో వసతులను మరింత విస్తరించడం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ 5,000 మందికి పైగా ప్రయాణికుల రద్దీ ఉండే 86 ప్రధాన బస్ స్టేషన్లను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ప్రత్యేకంగా గుర్తించి, ఆ ప్రదేశాలలో మెరుగైన ప్రయాణీకుల సమాచార మరియు ప్రసార సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ 86 బస్ స్టేషన్లన్నింటిలోనూ ప్రయాణికుల అవసరం కోసం ఒక కంట్రోలర్ ను నియించడంతో పాటూ ప్రత్యేక విచారణ, సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేశారు.
దీనివల్ల ప్రయాణికులు తమకు కావలసిన బస్సు సర్వీసులు మరియు సమయాలకు సంబంధించిన వివరాలను ఎలాంటి ఆటంకం లేకుండా తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా బస్సు కార్యకలాపాలపై స్పష్టమైన మరియు తాజా సమాచారాన్ని అందించేందుకు వీలుగా కొత్త బస్సు టైమ్‌టేబుల్ బోర్డులను కూడా అన్ని బస్ స్టేషన్లలో త్వరలోనే ప్రదర్శించనున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులకు సంబంధించి ముఖ్యంగా మొదటి మరియు చివరి బస్సు సమయాల గురించి క్రమం తప్పకుండా సమాచారం అందించేందుకు బస్ స్టేషన్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ (PAS) ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల భద్రత, బస్ స్టాండ్లలో రద్దీ నిర్వహణ మరియు కార్యకలాపాల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో అన్ని బస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ ప్రతిపాదిత సీసీటీవీ వ్యవస్థలను సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయానికి నేరుగా అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రయాణీకుల రాకపోకలు, బస్ స్టాండ్లలో రద్దీ పరిస్థితులు మరియు బస్ స్టేషన్ కార్యకలాపాలను కేంద్రీకృత పర్యవేక్షణ ద్వారా నిరంతరం సమర్థవంతంగా పరిశీలించడానికి వీలవుతుంది. టీజీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లలో ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడం, రద్దీ నిర్వహణను నిర్ధారించడం, సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన, మెరుగైన వ్యవస్థీకృత ప్రయాణాన్ని అందించడమే యాజమాన్యం ప్రధాన ఉద్దేశ్యం.
తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణీకుల సౌకర్యాలను నిరంతరం మెరుగుపరచడానికి, ప్రజా రవాణా సేవలను మరింత బలోపేతం చేయడానికి టీజీఎస్ఆర్టీసీ ఎల్లవేళలా కట్టుబడి ఉందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.