TGSRTC: కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!

కార్తిక మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో శివాలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు వల్ల కుటుంబాలు, స్నేహితుల బృందాలు ఒకేసారి యాత్రకు వెళ్లేందుకు వీలవుతుంది. బస్సులు కాలనీల నుంచే అందుబాటులో ఉండటంతో ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

TGSRTC: కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
Tgrtc

Updated on: Nov 10, 2026 | 12:26 PM

TGSRTC: కార్తిక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భక్తులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగరంలోని వివిధ కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచే ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సులను ఏర్పాటు చేసింది.

ఈ ప్రత్యేక బస్సులు 2026 నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో బస్సులో సుమారు 40 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, భక్తుల బృందాలు కలిసి యాత్రకు వెళ్లేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది.

ప్రత్యేక బస్సులు..

సాధారణంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే ముందుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి మరో బస్సు లేదా ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో వృద్ధులు, మహిళలు, పిల్లలతో కలిసి వెళ్లే కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి భక్తుల బృందాలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ముఖ్యంగా సోమవారాల్లో శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంచనుంది.

ఏయే పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుపుతారు?

భక్తులు ఒకే యాత్రలో పలు ఆలయాలను సందర్శించేలా ఆర్టీసీ ప్రత్యేక సర్క్యూట్లను రూపొందించింది.

1. కరీంనగర్ సర్క్యూట్: ఈ యాత్రలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొమురవెల్లి మల్లన్న ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను సందర్శించవచ్చు.

2. వరంగల్ సర్క్యూట్: కాళేశ్వరం, వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం, లక్నవరం వంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

3. శ్రీశైలం సర్క్యూట్: శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంతో పాటు ఉమామహేశ్వరం, సోమశిల, కందూరు, జోగులాంబ గద్వాల క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్రను రూపొందించారు.

పంచారామాల యాత్రకు ప్రత్యేక ప్యాకేజీలు:

ఏపీలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అన్నవరం, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి ప్రాంతాలను కలుపుతూ యాత్రా ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. అలాగే తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రానికి, కర్ణాటకలోని హంపి, మురుడేశ్వర్ పుణ్యక్షేత్రాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌కు సమీపంలోని కీసరగుట్ట, అనంతగిరి హిల్స్, ముచ్చింతల, యాదాద్రి, సోమశిల వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించారు.

బస్సుల వివరాల కోసం ఎవరిని సంప్రదించాలి?

ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సుల బుకింగ్, ప్యాకేజీల ధరలు, ప్రయాణ వివరాలు తెలుసుకోవాలనుకునే భక్తులు తమ ప్రాంతానికి సంబంధించిన TGSRTC డివిజన్ అధికారులను సంప్రదించవచ్చు.

డివిజన్ సంప్రదించాల్సిన నంబర్

  • కూకట్‌పల్లి 9959226148
  • సికింద్రాబాద్ 9959226142
  • హయత్‌నగర్ 9959226136
  • చార్మినార్ 9959226129
  • జూబ్లీ బస్‌స్టేషన్ (JBS) 9959226160

ఇది కూడా చదవండి: Business Ideas: ఉద్యోగం పోయిందా? నో టెన్షన్‌.. ఎప్పటికీ డిమాండ్‌ ఉండే 8 వ్యాపారాలు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us