మద్యం మత్తులో తెలంగాణ టాప్.. మహిళల్లోనూ పెరుగుతున్న వినియోగం! NFHS-6 షాకింగ్ రిపోర్ట్!

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) నివేదిక ప్రకారం, తెలంగాణ మద్యం వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9% మంది, మహిళల్లో 7.1% మంది మద్యం సేవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం అధికంగా ఉంది. మద్యం విక్రయాలు, ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరిగాయి, ఇది రాష్ట్రంలో మద్యం వాడకంపై చర్చకు దారితీస్తోంది.

మద్యం మత్తులో తెలంగాణ టాప్.. మహిళల్లోనూ పెరుగుతున్న వినియోగం! NFHS-6 షాకింగ్ రిపోర్ట్!
Alcohol Consumption
Image Credit source: AI Image

Edited By:

Updated on: Oct 03, 2026 | 1:06 PM

మద్యం వినియోగంలో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో మద్యం వినియోగం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

NFHS-6 ప్రకారం దేశవ్యాప్తంగా 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో మద్యం సేవించే వారి సగటు 18.9 శాతంగా ఉండగా.. తెలంగాణలో ఈ శాతం 43.9గా నమోదైంది. దీంతో పురుషుల్లో మద్యం వినియోగం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 42.2 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో, 38.3 శాతంతో ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో ఉన్నాయి. జార్ఖండ్‌లో 33.6 శాతం, మధ్యప్రదేశ్‌లో 26.9 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు సర్వే వెల్లడించింది.

మహిళల్లోనూ తెలంగాణలో మద్యం వినియోగం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల్లో 7.1 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు NFHS-6 గణాంకాలు చెబుతున్నాయి. మహిళల్లో మద్యం వినియోగంలో 19.9 శాతంతో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ 7.1 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఛత్తీస్‌గఢ్ 5.7 శాతం, జార్ఖండ్ 5.5 శాతం, మధ్యప్రదేశ్ 1.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తెలంగాణలో మద్యం వినియోగంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య కూడా స్పష్టమైన వ్యత్యాసం ఉన్నట్లు సర్వే పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 46.6 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం 36.3గా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం పట్టణ ప్రాంతాల కంటే 10.3 శాతం ఎక్కువగా నమోదైంది. తెలంగాణలో మద్యం వినియోగం అధికంగా ఉండటానికి గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని సర్వే వివరించింది.

మహిళల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 8.6 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 2.8 శాతంగా ఉంది. అంటే మహిళల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో మద్యం వినియోగానికి అనుగుణంగా మద్యం విక్రయాల ఆదాయం కూడా భారీగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మద్యం మార్కెట్ ద్వారా సుమారు రూ.40,209 కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదిక పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2024-25లో ఈ ఆదాయం సుమారు రూ.37,487 కోట్లుగా ఉంది. అదే సమయంలో 2025-26లో 382.91 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరగగా.. 2024-25లో 372.25 లక్షల కేసులు విక్రయమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మద్యం విక్రయాల పెరుగుదలకు అనుగుణంగా ఎక్సైజ్‌ ఆదాయం కూడా పెరిగింది. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఎక్సైజ్‌ ఆదాయం సుమారు రూ.39,368 కోట్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం ఎక్సైజ్‌ కలెక్షన్లు రూ.44,000 కోట్లను దాటినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

ఒకవైపు తెలంగాణలో మద్యం వినియోగం దేశంలోనే అత్యధిక స్థాయిలో నమోదవుతుండగా.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వినియోగం మరింత ఎక్కువగా ఉండటం సర్వేలో కీలక అంశంగా మారింది. మద్యం వినియోగం, గ్రామీణ-పట్టణ వ్యత్యాసం, అలాగే పెరుగుతున్న మద్యం విక్రయాల ఆదాయం.. తెలంగాణలో మద్యం వినియోగంపై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us