Telangana: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అవి లేకపోతే నో-ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్!

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలను తీసుకుంటుంది. ఇందులో బాగంగానే తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో హైవేలపై తిరిగే వాహనదారులకు ఎదురుగా వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపించేందుకు వాటిపై క్యూఆర్ కోడ్ ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లను అమర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన పాటించని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయబోమని రవాణా శాఖ స్పష్టం చేసింది.

Telangana: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అవి లేకపోతే నో-ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్!
Telangana Road Safety

Edited By:

Updated on: Feb 12, 2026 | 5:00 PM

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రవాణా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి సమయంలో రోడ్లపై తిరిగే వాహనాలు ఇతర వాహనదారులకు స్పష్టంగా కనిపించేందుకు వాటిపై క్యూఆర్ ఆధారిత రిఫ్లెక్టీవ్ టేపులు అమర్చాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర మోటార్ వాహనాల నియమాలు, 1989 లోని రూల్ 104 -104(E) ప్రకారం రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి అని పేర్కొంది. వాహనాలపై QR ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS) ద్వారా ధృవీకరణ విధానాన్ని అమలు చేయనున్నట్లు రవాణా శాఖ తెలియజేస్తోంది. ఈ విధానం 20-02-2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది.

అయితే ఇందుకోసం ప్రభుత్వం 5 కంపెనీలను ఎంపానెల్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దరఖాస్తులను పరిశీలించి ఈ ఐదు తయారీదారులను ఎంపానెల్ చేయడం జరిగింది. వీటిలో ఇండియా లిమిటెడ్, ఒరఫఫోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అవెరి డెన్నిసన్ ఇండియా, గ్లోడియన్ రిఫ్లెక్టివ్, డోమింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్స్ సంస్థలు ఉన్నాయి. వాహనదారులు ఈ సంస్థలకు చెందిన అధీకృత డీలర్లు, అప్లికేటర్ల ద్వారా తమ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగోతో కూడిన హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్ నంబర్ కలిగిన QR కోడ్ కచ్చితంగా ఉండాలి.

అయితే ఈ క్యూఆర్ ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులను అందించేందుకు ఆయా కంపెనీలు వాహనదారుల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వంమే వాటి ధరలను నిర్ణయించింది. అఫిక్సేషన్, సర్టిఫికేట్ ఛార్జీలు కూడా ఇందులోనే ఉండనున్నట్టు రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇక ధరల విషయానికి వస్తే.. CT 20MM మీటరుకు రూ.79.80 నుంచి రూ.85, CT 50MM మీటరుకు రూ.145 నుంచి రూ151.80, C3/C4 ప్లేట్లు జతకు రూ.2500 నుంచి రూ.2,900 వరకు, రిఫ్లెక్టర్లకు (40MM/80MM)కు రూ.35 నుంచి రూ.60 వరకు ధరలను నిర్ణయించింది. అయితే, వాహనాలకు టేపులు అమర్చిన తర్వాత డీలర్లు కనీసం 2 ఏళ్ల వారంటీతో కూడిన అఫిక్సేషన్ సర్టిఫికేట్ ఇస్తారు.

తనిఖీల సమయంలో రవాణా శాఖ అధికారులు QR స్కానింగ్ ద్వారా రిఫ్లెక్టింగ్ టేపులను ధృవీకరిస్తారు. ఒక వేళ ఆయా సంస్థలు అమర్చిన రిఫ్లెక్టింగ్ టేపులు నకిలీవని తేలితే నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందుకే వాహన యజమానులు కేవలం ఎంపానెల్ చేసిన సంస్థల అధీకృత డీలర్ల వద్ద మాత్రమే రిఫ్లెక్టివ్ టేపులు అమర్చించుకోని రోడ్డు భద్రతలో భాగస్వాములు అవ్వాలని వాహనదారులకు రశాణా శాఖ పిలుపునిచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.