
కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత ప్రత్యేకమైన లేదా తమకు నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ (ఫ్యాన్సీ నంబర్) తీసుకోవాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్‌ను ఎంపిక చేసుకునేందుకు ఉన్న 30 రోజుల గడువును 60 రోజులకు పెంచింది. దీంతో వాహన యజమానులకు తమకు నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకునేందుకు మరింత సమయం లభించనుంది.
సాధారణంగా కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు ముందుగా తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) ఇస్తారు. గతంలో ఈ టీఆర్ గడువు 30 రోజులు మాత్రమే ఉండేది. ఆ సమయంలోనే ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసి, నంబర్‌ను ఖరారు చేయాల్సి వచ్చేది. అయితే చాలామంది వాహన యజమానులు తమకు కావాల్సిన నంబర్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవడం, వేలం ప్రక్రియలో పాల్గొనడం లేదా ఇతర కారణాల వల్ల గడువులోపు ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ గడువును రెండు నెలలకు పెంచింది.
వాహనం కొనుగోలు చేసే సమయంలో ఫ్యాన్సీ నంబర్ కావాలని ఎంపిక చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ నంబర్‌ను ఖరారు చేయని వారు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కొత్త నిబంధనల ప్రకారం, తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన తేదీ నుంచి రెండు నెలల లోపు ఫ్యాన్సీ నంబర్‌ను బుక్ చేసుకోకపోతే, ఆ వాహనానికి శాఖ తరఫున సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయిస్తారు. అంటే వాహన యజమాని ఎలాంటి ప్రత్యేక నంబర్‌ను ఎంపిక చేయకపోతే, అందుబాటులో ఉన్న సాధారణ సీరియల్ నంబర్‌ను వాహనానికి కేటాయిస్తారు.
ఒకసారి సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన తర్వాత తిరిగి ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల ప్రత్యేక నంబర్ కావాలనుకునే వాహన యజమానులు నిర్ణీత గడువులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..