దివ్యాంగ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 1,000 మందికి స్కూటీలు!

Telangana disabled student scooters: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగ ఇంటర్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమస్యలు తొలగించి విద్యను కొనసాగించేందుకు 2026-27 విద్యా సంవత్సరంలో 1,000 మందికి త్రిచక్ర స్కూటీలు పంపిణీ చేయనుంది. దీనికోసం రూ.10 కోట్లు కేటాయించారు. ఈ పథకం దివ్యాంగ విద్యార్థులు ఉన్నత విద్యలో చేరేలా ప్రోత్సహించి, వారి సంఖ్యను పెంచడమే లక్ష్యం.

దివ్యాంగ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 1,000 మందికి స్కూటీలు!
Telangana Disabled Student Scooters

Edited By:

Updated on: Sep 30, 2026 | 9:05 AM

హైదరాబాద్: దివ్యాంగ విద్యార్థులు ఇంటర్ విద్యను కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలను అందించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం 2026–27లో మొత్తం 1,000 మంది విద్యార్థులకు స్కూటీలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

ప్రయాణ ఇబ్బందులకు పరిష్కారం

శారీరక వైకల్యం కారణంగా పదో తరగతి తర్వాత చదువును కొనసాగించలేకపోతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇంటర్‌లో చేరినప్పటికీ కళాశాలకు రాకపోకలు వారికి ప్రధాన సమస్యగా మారుతున్నాయి. బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. విద్యార్థుల రాకపోకలను సులభతరం చేసేందుకు స్కూటీలను అందించాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది.

రూ.10 కోట్ల కేటాయింపు

ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించింది. విద్యార్థులకు అందించే వాహనాలు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ రూపంలో ఉంటాయి. ఇవి పెట్రోల్‌తో పాటు విద్యుత్తుతో కూడా నడిచే విధంగా ఉంటాయి.

జిల్లా స్థాయిలో అర్హుల ఎంపిక

స్కూటీల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మరో నెల రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చిన దరఖాస్తులను జిల్లా స్థాయి పరిశీలన కమిటీ పరిశీలిస్తుంది. అర్హత ప్రమాణాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

అధిక దరఖాస్తులు వస్తే ప్రాధాన్యం ఇలా

నిర్దేశించిన 1,000 మంది కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే.. వైకల్యం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహకారం తీసుకోనున్నారు.

దివ్యాంగ విద్యార్థుల సంఖ్య పెంచే లక్ష్యం

ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్కో కళాశాలకు సగటున ఒకరిద్దరు దివ్యాంగ విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్కూటీల సౌకర్యం అందుబాటులోకి వస్తే మరింత మంది దివ్యాంగ విద్యార్థులు ఇంటర్ విద్యలో చేరే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలా ఉండగా.. గత విద్యా సంవత్సరం జీడిమెట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల కోసం ఇంటర్‌లో ప్రత్యేక సెక్షన్‌ను ప్రారంభించారు. దివ్యాంగ విద్యార్థులకు విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగానే తాజా స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us