
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పచ్చి గుడ్లతో తయారుచేసే మయోనైస్ ఉత్పత్తి, విక్రయం, నిల్వలపై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ ఆహార భద్రతా కమిషనర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాజ్ఞలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో పచ్చి గుడ్లను ఉపయోగించి తయారుచేస్తున్న మయోనైస్ కారణంగా అనేకమంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు వెలుగుచూశాయి. పచ్చి గుడ్లలో ప్రమాదకరమైన సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వృద్ధి చెంది, ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తోందని ఆరోగ్య నిపుణులు, ఆహార భద్రతా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండేందుకు అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పచ్చి గుడ్లతో చేసే మయోనైస్ తయారీ, నిల్వ లేదా విక్రయాలు పూర్తిగా నిషిద్ధం. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
రెస్టారెంట్లు మరియు ఫుడ్ వెండర్లు పచ్చి గుడ్లతో కాకుండా వెజ్ మయోనైస్ లేదా పాశ్చరైజ్డ్ గుడ్ల ఉత్పత్తులను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు. మార్కెట్లో నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. ఆహార నాణ్యత విషయంలో రాజీపడితే సహించేది లేదని హెచ్చరించారు.