Telangana: వామ్మో..ఆ స్కూలా.. మా పిల్లలను అస్సలు పంపించం..!

| Edited By: Velpula Bharath Rao

Dec 22, 2024 | 10:07 AM

విద్యార్థుల సంక్షేమానికి కేరాఫ్ కావలసిన చోట.. భరోసా కరువైపోయింది. భద్రత కానరాకుండాపోయింది. విషసర్పాలతో అక్కడి విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించారని వార్తలు వినాల్సిన చోట.. నిత్యం పాముకాట్ల కలకలం రేపింది. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మరోసారి పాముకాటుకి గురికావడం అక్కడి భద్రతను కళ్లకు కడుతోంది. గతంలోనూ ఇద్దరు విద్యార్థులు పాముకాట్లకు గురై మృతి చెందారు.

Telangana: వామ్మో..ఆ స్కూలా.. మా పిల్లలను అస్సలు పంపించం..!
Gurukulam
Follow us on

రాత్రైతే చాలు ఎక్కడి నుంచి పాము వస్తుందో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌‌లో జగిత్యాల జిల్లా మెట్‌పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా బుధవారం రాత్రి ఓంకార్ అఖిల్ అనే 8వ తరగతి విద్యార్థి పాముకాటుకు గురికాగా.. కుట్టిన పాము రక్తపింజరగా వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఓంకార్ అఖిల్‌కు కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. అలా రాత్రి చేదు ఘటన మరవకముందే తెల్లవారే యశ్విత్ అనే మరో 8వ తరగతి విద్యార్థి పాముకాటుకు గురై తననూ కోరుట్లలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వెళ్లగా పాము కుబుసాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళగా చూస్తున్న దృశ్యాలు కెమెరా కంటపడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి.

పాముల బెడద పెరిగిపోవడం, గతంలో ఇద్దరు విద్యార్థులు పాముకాట్లతో చనిపోవడంతో పెద్దాపూర్ గురుకులం ఇప్పుడు వార్తల్లో హెడ్ లైన్స్‌గా మారింది. తాజాగా మరో ఇద్దరిని కూడా కరవడంతో.. పాములు పట్టేవారిని అధికారులు పిలిపించారు. ఈ నేపథ్యంలో పుంగీ పట్టుకుని పాముల కోసం వెతికాడు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలోని రూం నంబర్ వన్‌లో ఇద్దరు విద్యార్థులు బుధవారం రాత్రి ఓంకార్ అఖిల్, గురువారం ఉదయమే యశ్విత్ పాముకాట్లకు గురయ్యారు. విద్యార్థులు పాముకాట్లకు గురవ్వడం ఆందోళన రేకెత్తించడంతో పెద్దాపూర్ గురుకులాన్ని కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు, ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పరిశీలించారు. ఓవైపు విద్యార్థులకు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.. ఈ పాఠశాల కు విద్యార్థులను పంపాలంటే నమ్మకం కుదురడం లేదు.

సరిగ్గా మూణ్నెల్ల క్రితమే గణాదిత్య, అనిరుధ్ అనే ఇద్దరు ఇదే 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాముకాట్లతో ప్రాణాలు కోల్పోగా.. మరో నల్గురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బృందం ఇక్కడ పర్యటించింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించింది. కానీ, మళ్లీ మూణ్నెల్లు గడిచేసరికి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోగా.. పెద్దాపూర్ గురుకులానికి పిల్లల్ని పంపితే మృత్యుకుహరంలోకి పంపడమేనన్న భయం ఇప్పుడు తల్లిదండ్రుల్లో మొదలైంది. ఈ పాఠశాలకు పంపడం తమ వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. చదువు లేకున్నా పర్వాలేదు గానీ.. తామ పిల్లల ప్రాణాలు ముఖ్యమని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. సుమారుగా ఆరు గంటల పాటు నిజామాబాద్-కోరుట్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పెద్దాపూర్‌లో ప్రస్తుతమున్న ప్రదేశం నుంచి గురుకుల పాఠశాలను ఎత్తేయాలని విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా..చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయినా వారికి అధికారులపై ఇంకా నమ్మకం రావడం లేదు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పరిస్థితులపై గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. పాముకాటుకు బలైన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన అనిరుధ్ కుటుంబాన్ని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా పెద్దాపూర్ గురుకులాన్ని పలుమార్లు సందర్శించారు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. మరోవైపు మళ్లీ పెద్దాపూర్ గురుకులంలో పాముకాట్ల కలకలం రేపాయి. అధికార పార్టీ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బెడ్‌పై నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసిందని విద్యార్థులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి