
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ రాష్ట్రంలోని అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాల్లో ఒకటి. ఈ సందర్భంగా కొత్తగా వివాహమైన కుమార్తె పుట్టింటికి వచ్చే ఆచారాన్ని ప్రతీకగా భావిస్తూ, నిత్య పెళ్లికుమార్తె అయిన అమ్మవారు ప్రతి ఆషాఢంలో తన పుట్టింటికి వస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసంతో అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉందని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో శక్తి స్వరూపిణి మహాకాళి అమ్మవారు కొలువై ఉండగా, ప్రతి ఏడాది జరిగే బోనాల జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 2 ఆదివారం రోజున ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరగనున్నాయి.
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా నగరంలో భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఆలయం పరిసరాల్లో సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీసుల ప్రకారం.. ఆగస్టు 1 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 4 తెల్లవారుజామున ఉదయం 3 గంటల వరకు జాతర పూర్తయ్యేంత వరకు కొన్ని కీలక మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
జాతరకు వచ్చే భక్తుల కోసం హరిహర కళాభవన్, యశోద హాస్పిటల్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ షాపింగ్ మాల్, పాత జైలు ఖానా ఖాళీ స్థలం, ఇస్లామియా హై స్కూల్, ప్రభుత్వ అడవయ్య మెమోరియల్ హై స్కూల్, నల్లగుట్ట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, మహాత్మా గాంధీ విగ్రహం (ఎంజీ రోడ్), పార్సీ టెంపుల్, వెస్లీ కాలేజీ, జీహెచ్‌ఎంసీ స్థలం, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్, తాజ్ త్రీ స్టార్ లైన్ ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.
ప్రజలకు ట్రాఫిక్‌కు సంబంధించిన అత్యవసర సమాచారం లేదా సహాయం అవసరమైతే 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్‌కు మహంకాళి అమ్మవారు ఎలా వచ్చారు..? బోనాల వెనుక ఉన్న 200 ఏళ్ల చరిత్ర ఇదే!