అక్కడేముంది రాళ్లు, చెత్త అనుకునేరు.. అదో అరుదైన జీవి..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవుల్లో అరుదైన గొల్లభామలు (ఇండియన్ గ్రాస్ మాంటిస్) మళ్లీ కనిపిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టు పరిధిలోని వెదురు పొదల్లో కనిపించిన ఈ మిత్ర కీటకాలు పంటలకు హాని చేసే పురుగులను ఆహారంగా తీసుకుంటూ సహజ కీటక నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.

అక్కడేముంది రాళ్లు, చెత్త అనుకునేరు.. అదో అరుదైన జీవి..
Indian Grass Mantis

Edited By:

Updated on: Jun 12, 2026 | 11:04 AM

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవుల్లో దశాబ్దాల కాలంగా అరుదుగా కనిపిస్తున్న గొల్లభామలు మళ్లీ దర్శనమివ్వడంతో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టు పరిధిలోని వెదురు పొదలు, గడ్డి ప్రాంతాల్లో ఈ అరుదైన కీటకాలు కనిపించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవల సత్తుపల్లికి చెందిన ఓ పర్యాటకుడు అడవిలో విహరిస్తుండగా వెదురు చెట్ల మధ్య పరిసరాల్లో కలిసిపోయి ఉన్న గొల్లభామలను గుర్తించాడు. తొలిచూపులో గడ్డి లేదా ఆకుల మాదిరిగా కనిపించే ఈ కీటకాలు తమ ప్రత్యేక రంగు, ఆకృతితో సహజ వాతావరణంలో కలిసిపోవడం వల్ల గుర్తించడం చాలా కష్టం. దీంతో వాటిని చూసిన పర్యాటకుడు ఆశ్చర్యానికి గురయ్యాడు.

గొల్లభామను శాస్త్రీయంగా ఇండియన్ గ్రాస్ మాంటిస్ అని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో, అడవుల్లో, గడ్డి మైదానాల్లో కనిపించే ఈ కీటకం ప్రకృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తన అందమైన కదలికలు, ఆకర్షణీయమైన రూపం కారణంగా దీనిని కొందరు వయ్యారి భామ అని కూడా వ్యవహరిస్తారు.

వ్యవసాయానికి మేలు చేసే మిత్ర కీటకాలలో గొల్లభామ ఒకటి. పంటలకు నష్టం కలిగించే అనేక రకాల చిన్న కీటకాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా సహజ కీటక నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో రైతులకు పరోక్షంగా మేలు చేస్తూ పంటలను రక్షించడంలో తోడ్పడుతుంది. రసాయన కీటకనాశకాల వినియోగం తగ్గించడంలో కూడా ఇటువంటి మిత్ర కీటకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

తొలకరి వర్షాలు ప్రారంభమైన తర్వాత కనిపించే అరుదైన కీటకాలలో గొల్లభామ ఒకటి. పర్యావరణ సమతుల్యతకు సూచికగా భావించే ఈ కీటకాలు మళ్లీ అడవుల్లో కనిపించడం ఆ ప్రాంత జీవవైవిధ్యం ఇంకా పరిరక్షితంగా ఉందనే సంకేతంగా నిపుణులు పేర్కొంటున్నారు.

కనకగిరి అడవుల్లో గొల్లభామల దర్శనం పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా ప్రకృతి సంపదను కాపాడాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. జీవవైవిధ్య పరిరక్షణకు అడవులు, సహజ ఆవాసాల సంరక్షణ ఎంత ముఖ్యమో ఈ అరుదైన కీటకాల ఉనికి స్పష్టం చేస్తోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us