
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో సినీ ఫక్కిలో జరిగిన ఓ కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. చిత్తాపూర్ గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులే దౌర్జన్యంగా కిడ్నాప్ చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. చిత్తాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు, సంతోష్ నగర్ కు చెందిన కళ్యాణి (26) అనే యువతి వారం రోజుల క్రితం యాదగిరిగుట్ట వద్ద ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వారు అబ్బాయి ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఈ వివాహం ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 20 మందికి పైగా కలిసి రాత్రి వేళ అబ్బాయి ఇంటిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఇంట్లోకి చొరబడి వధువు కళ్యాణిని రాత్రి సమయలో బలవంతంగా అపహరించి తీసుకెళ్లారు.
కుటుంబ సభ్యుల ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఎత్తుకెళుతున్నారన్న విషయం తెలుసుకున్న యువకుడు.. వారిని అడ్డగించదంతో కారును వదిలేసి పారిపోయారు. ఈ అకస్మాత్తు దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాధితుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు మంచాల పోలీసులు కేసు నమోదు చేసి, కిడ్నాప్‌కు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన వెనుక ప్రేమ వివాహమే ప్రధాన కారణమా? యువతిని ఎవరు తీసుకెళ్లారు? ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉంది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.