రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..

| Edited By: Srikar T

May 18, 2024 | 10:20 AM

తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు కలిగిన వరంగల్‎లోని కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. నిత్య వివాదాలతో ఆ విశ్వవిద్యాలయం సతమతవుతుంది. తాజాగా ఇదే యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్స్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలోనే 40 గంట‌ల‌కుపైగా ఆందోళ‌న నిర్వ‌హించారు. ఆయన ఛాంబ‌ర్‌‎లోనే భోజ‌నం చేయ‌డంతో పాటు ఏకంగా రాత్రంతా అక్క‌డే బ‌సచేశారు.

రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
Warangal
Follow us on

తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు కలిగిన వరంగల్‎లోని కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. నిత్య వివాదాలతో ఆ విశ్వవిద్యాలయం సతమతవుతుంది. తాజాగా ఇదే యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్స్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలోనే 40 గంట‌ల‌కుపైగా ఆందోళ‌న నిర్వ‌హించారు. ఆయన ఛాంబ‌ర్‌‎లోనే భోజ‌నం చేయ‌డంతో పాటు ఏకంగా రాత్రంతా అక్క‌డే బ‌సచేశారు. విష‌యం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి హామీతో ఆందోళన విరమించారు.

అస‌లు స‌మ‌స్య కారణం..?

కే.యూ లో గత కొన్నేళ్లుగా టీచింగ్ ఫ్యాక‌ల్టీ నియామ‌కాలు నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ లెక్చ‌ర‌ర్స్ విద్యార్థుల‌కు పాఠాలు చెబుతున్నారు. కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్స్‌తో పాటు పార్ట్ టైమ్ లెక్చ‌ర‌ర్స్ దాదాపు 126 మంది గత ప‌దేళ్ళుగా ప‌నిచేస్తున్నారు. పార్ట్ టైమ్ లెక్చ‌ర‌ర్స్‎కు మాత్రం ఆరు నెల‌ల‌కు ఒక‌సారి జీతాలు వ‌స్తుంటాయి. ఇదే విష‌యాన్ని గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా మంత్రుల‌ను క‌లిసి వారి గోడు వెళ్ల బోసుకున్నారు. త‌ప్ప‌కుండా ప‌రిష్క‌రిస్తామ‌ని చాలా సార్లు హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ ప‌రిష్కారం మాత్రం కాలేదు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల హ‌డావుడి ముగియ‌డంతో పార్ట్ టైం లెక్చరర్స్ అంతా కేయూ వైస్ ఛాన్స్‌ల‌ర్ ప్రొఫెస‌ర్ ర‌మేశ్‌‎ను క‌లిసి స‌మస్య ప‌రిష్క‌రించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వీ.సీ మీరంతా అఫిడ‌విట్‌‎లు తెచ్చుకోండి ఆర్డ‌ర్‌‎లు ఇస్తామ‌ని హామి ఇచ్చారని బాధితులు తెలిపారు. ఆనందంతో ఉప్పొంగిపోయిన పార్ట్ టైం లెక్చరర్స్ అంతా అఫిడ‌విట్‌లు తెచ్చుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. వైస్ ఛాన్స్‌ల‌ర్ మొఖం చాటేశాడు. దీంతో పార్ట్ టైం లెక్చ‌ర‌ర్స్ అంతా రిజిష్ట్రార్‌‎ను క‌లిసి మీరైనా స‌మ‌స్యను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దం ఇదీ.. నేను చేయ‌లేను అని చేతులెత్తేశార‌ని పార్ట్ టైం లెక్చ‌ర‌ర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

దీంతో గురువారం ఉదయం నుండి దాదాపు 40 గంటల పాటు రిజిష్ట్రార్ ఛాంబ‌ర్‌లోనే అంద‌రూ బైఠాయించారు. ఏకంగా రాత్రి భోజ‌నాలు కూడా అదే ఛాంబ‌ర్‌లో చేశారు. అనంత‌రం రాత్రి అక్క‌డే బ‌స చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అక్క‌డ‌కు చేరుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. బాధితుల ఆవేదన విన్న MLA నాయిని రాజేందర్ రెడ్డి.. వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‎పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క బారేట‌ట్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గంట‌ల తరబడి లెక్చ‌ర‌ర్స్ ఆందోళ‌న నిర్వ‌హిస్తుంటే ప‌ట్టించుకోకుండా ఏం చేస్తున్నార‌ని రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ మ‌ల్లారెడ్డిని నిల‌దీశారు. వైస్ ఛాన్స్‌ల‌ర్ ఎందుకు ఇక్క‌డ‌కు రాలేద‌ని ప్రశ్నించారు. వీసీ ర‌మేశ్ ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందు పెద్ద సంఖ్య‌లో ఎందుకు ఆర్డ‌ర్స్ తీస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. వెంట‌నే పార్ట్ టైమ్ లెక్చ‌ర‌ర్స్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని రిజిస్ట్రార్ మ‌ల్లారెడ్డిని కోరారు. ప్రభుత్వ ప‌రంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..