Weather Alert: అక్టోబర్‌లో నిప్పులే.. వానలు లేవు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

నైరుతి రుతుపవనాలు ముగింపు దశకు చేరినా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వానల జాడ కనిపించడం లేదు. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో 1901 తర్వాత 13వ అత్యల్ప వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న అక్టోబర్‌లోనూ ఇదే తరహా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని, పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పెరగనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.

Weather Alert: అక్టోబర్‌లో నిప్పులే.. వానలు లేవు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
Imd Weather Forecast October 2026

Updated on: Oct 01, 2026 | 12:50 PM

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సీజన్ తీవ్ర వర్షపాత లోటుతో నిరాశపరిచింది. రానున్న అక్టోబర్ – డిసెంబర్ కాలంలోనూ మెజారిటీ ప్రాంతాల్లో పొడి వాతావరణమే రాజ్యమేలనుంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పాటు పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పైపైకే చేరతాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో ప్రభావమే ఇందుకు ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

1901 తర్వాత 13వ అత్యల్ప వర్షపాతం.. తీవ్ర నిరాశలో మాన్సూన్

జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల కాలంలో దేశంలో ఆశించిన వర్షాలు కురవలేదు. దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో కేవలం 87శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. మొత్తం రికార్డైన 759.4 మి.మీ వర్షపాతం.. 2001 తర్వాత 4వ అత్యల్పం కాగా, 1901 నుంచి చూస్తే 13వ అత్యల్ప వర్షపాతంగా నమోదైంది.

ప్రాంతాల వారీగా తీవ్ర లోటు

తూర్పు, ఈశాన్య భారతంలో కేవలం 1016.3 మి.మీ మాత్రమే వర్షం కురవడంతో 1901 తర్వాత సరికొత్త అత్యల్ప రికార్డు నమోదైంది. అలాగే దక్షిణ ద్వీపకల్పంలో 542.0 మి.మీ వర్షపాతం పడగా, ఇది 2001 తర్వాత 2వ అత్యల్పం. వ్యవసాయానికి కీలకమైన మాన్సూన్ కోర్ జోన్‌లో 779.9 మి.మీ వర్షపాతం మాత్రమే కురిసింది. దేశంలోని 36 వాతావరణ సబ్ డివిజన్స్‌లో ఏకంగా 17 ఉప విభాగాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. 18 సబ్ డివిజన్స్‌లో సాధారణ వర్షపాతం నమోదు కాగా దేశంలో కేవలం ఒకే ఒక్క సబ్-డివిజన్ అయిన ఒడిశాలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

నెలలవారీ గణాంకాలు

జూన్‌లో 65శాతం, జూలైలో 101శాతం, ఆగస్టులో 84శాతం, సెప్టెంబర్‌లో 92శాతం వర్షపాతం నమోదైంది. సీజన్ మొత్తం మీద 14 అల్పపీడన వ్యవస్థలు ఏర్పడినా, జూన్ నెలలో ఒక్కటి కూడా ఏర్పడకపోవడం తొలిదశలో తీవ్ర వర్షాభావానికి కారణమైంది.

అక్టోబర్ – డిసెంబర్ సూచన.. పెరగనున్న వేడి

ఈశాన్య రుతుపవనాల సీజన్, అక్టోబర్ నెల వాతావరణంపై ఐఎండీ విడుదల చేసిన నివేదిక వివరాలు..

అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా వర్ష లోటు: 2026 అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాయువ్య, దక్షిణ ద్వీపకల్పం, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పొడి వాతావరణమే ఉండనుంది.

దక్షిణ ద్వీపకల్పానికి మాత్రమే ఊరట: అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక పరిధిలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. మిగిలిన భారతదేశంలో వర్షాలు సాధారణం కంటే తక్కువగానే ఉంటాయి.

భగభగ మండనున్న ఉష్ణోగ్రతలు: అక్టోబర్ నెలలో ఈశాన్య భారతదేశం మినహా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు, రాత్రి వేళ నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి.

సముద్ర పరిస్థితులు: పసిఫిక్ మహాసముద్రంపై ప్రస్తుతం బలమైన ఎల్ నినో పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి ఏడాది చివరి వరకు మరింత బలపడే సూచనలు ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో తటస్థ ఐవోడీ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

తెలంగాణపై వాతావరణ పిడుగు.. వర్షాభావంతో పాటు ఉక్కపోత

తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ నెలతో పాటు అక్టోబర్ – డిసెంబర్ సీజన్ మొత్తంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు టెర్సైల్ మ్యాప్స్ వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ నెల అంతటా తెలంగాణవ్యాప్తంగా పగటివేళ గరిష్ట ఉష్ణోగ్రతలు, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. దీంతో అక్టోబర్‌లో వర్షాల జాడ లేకపోవడంతో పాటు ఎండల తీవ్రత, ఉక్కపోత కొనసాగే ప్రమాదం ఉంది.

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యమైనప్పటికీ సరైన వానలు కురవకపోవడం, అక్టోబర్‌లోనూ లోటు వర్షపాతం కొనసాగే సూచనలు ఉండటంతో సాగునీరు, తాగునీటి అవసరాలు, వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా పడే అవకాశం ఉంది. అక్టోబర్ నెలాఖరులో నవంబర్ నెలకు సంబంధించిన సమగ్ర వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేయనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us