
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. సొంత బాబాయ్ ఇంట్లో సుపారీతో దోపిడీ చేయించిన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వివరాల ప్రకారం.. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మార్వాడి వ్యాపారీ కుటుంబ సమేతంగా వేములవాడ మల్లన్న దర్శనానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి పకడ్బంధీగా దేవుడి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే.. వారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.41 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు నగదు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఆర్మూర్ పట్టణంలోని బ్రాహ్మణపల్లి చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా బ్యాగ్ తో సంచరిస్తుండగా.. పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకోవడంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది.
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కు చెందిన విజయ్ అగర్వాల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతనికి నేర చరిత్ర ఉంది. దాదాపు ఏడు కేసులు నమోదు అయ్యాయి. విజయ్ అగర్వాల్ తన బాబాయ్ ఇంట్లో చోరీకి పథకం రచించాడు. విజయ్ అగర్వాల్ తనకు పరిచయం ఉన్న హైదరాబాద్ బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన సల్మాన్ ఖాన్ అలియాస్ కలీం లల్లాతో పాటు అదే ప్రాంతంలో వేంకటేశ్వ కాలనీకి చెందిన ముంజల్ సాయి కుమార్, శ్రీ హరి అనే వ్యక్తి ద్వారా తన బాబాయ్ ఇంటిలో చోరికి ప్లాన్ వేశారు. అందుకు గాను ముగ్గురికి కొన్ని డబ్బులు ఇచ్చి చోరీ చేయాలని దోచుకున్న సొమ్ము పంచుకోవాలని పథకం రచించాడు.
ఇందులో భాగంగా.. మే 24న తన బాబాయ్ ఇంటికి తాళం వేసి వెళ్లగా ముగ్గురి ద్వారా రూ.41 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు నగదు చోరీ చేశారు. అందులో శ్రీహరి 8 లక్షలు నగదు తీసుకుని పరారీలో ఉండగా మిగిలిన 31 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు 19 లక్షల నగదును సీజ్ చేసి విజయ్ అగర్వాల్, సల్మాన్ ఖాన్, ముంజల్ సాయి కుమార్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడు విజయ్ అగర్వాల్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు.. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..