పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌కు శ్రీమంతం.. కుటుంబ సభ్యుల్లా ఆశీర్వదించిన సహచరులు!

విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు.. తమ సహోద్యోగి సంతోషంలో భాగస్వాములయ్యారు. నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో ఏడు నెలల గర్భిణి అయిన కానిస్టేబుల్ శిరీషకు అధికారులు, సిబ్బంది కలిసి సంప్రదాయబద్ధంగా శ్రీమంతం వేడుక నిర్వహించి ఆశీర్వదించారు. పూర్తి వివరాలు కథనంలో..

పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌కు శ్రీమంతం.. కుటుంబ సభ్యుల్లా ఆశీర్వదించిన సహచరులు!
Police Station Baby Shower

Edited By:

Updated on: Nov 13, 2026 | 1:19 PM

 

నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు.. తమ సహోద్యోగి జీవితంలో ప్రత్యేకమైన సందర్భాన్ని ఆప్యాయంగా వేడుకగా జరిపించారు. విధి నిర్వహణలోనే కాదు.. తోటి సిబ్బంది సంతోషాల్లోనూ తామున్నామంటూ కుటుంబ సభ్యుల్లా అండగా నిలిచారు. నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ వేడుక పలువురిని ఆకట్టుకుంది. నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శిరీష ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఈ నేపథ్యంలో గురువారం ఆమెకు పోలీస్ స్టేషన్‌లోనే శ్రీమంతం వేడుక నిర్వహించారు. సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహిళా ఎస్‌ఐ గాయత్రి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంప్రదాయబద్ధంగా శ్రీమంతం వేడుక

శిరీషకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించిన పోలీసులు.. చీర, పూలు, పండ్లు అందజేశారు. కుటుంబ సభ్యుల మాదిరిగా ఆమెను ఆప్యాయంగా ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో నిత్యం ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొనే పోలీసులు.. సహోద్యోగి జీవితంలో ముఖ్యమైన ఘట్టాన్ని తమ ఇంటి వేడుకలా జరపడం ప్రత్యేకంగా నిలిచింది.

పోలీస్ శాఖలో విధి నిర్వహణతో పాటు తోటి సిబ్బంది పట్ల ఉండే ఆత్మీయత, ఐక్యత, పరస్పర సహకారానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది. తన శ్రీమంతం వేడుకను పోలీస్ స్టేషన్‌లో ఇంత ఆప్యాయంగా నిర్వహించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బందికి కానిస్టేబుల్ శిరీష ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ఖాకీ యూనిఫామ్‌లో బాధ్యతలు నిర్వర్తించే పోలీసులు.. తమలో ఒకరి సంతోషాన్ని అందరూ పంచుకోవడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us