
గురుకులాలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసే కామాందుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రర్తించిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నిడమనూరులో సంక్షేమ గురుకుల పాఠశాలలో భవన వసతి లేకపోవడంతో కనగల్ మండల పరిధిలో గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సతీష్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. వాష్ రూమ్ లకు వెళ్లే విద్యార్థినిల శరీరంపై అసభ్యకరంగా చేతులు వేస్తున్నాడని, బాత్రూమ్కు వెళ్లే సమయంలో వెంబడిస్తున్నాడని విద్యార్థినిలు వాపోతున్నారు.
పారిశుధ్య కార్మికుడు సతీష్ వికృత చేష్టలతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలే పసి పిల్లలు.. పైగా బయటకు చెబితే ఏమవుతుందోనన్న తీవ్ర భయాందోళనల మధ్య రోజులు గడిపారు. కానీ, ఆ కామాంధుడి వేధింపులు మితిమీరిపోవడంతో తట్టుకోలేకపోయిన విద్యార్థినులు.. ధైర్యం చేసి దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లిన సమయంలో తమ తల్లిదండ్రులకు ఈ ఘోరాన్ని వివరించారు. చిన్నారుల మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఇక ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిడమనూరు గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల సిబ్బందిని తీవ్రంగా నిలదీశారు. విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఎందుకు వహించారంటూ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాలు సైతం రంగంలోకి దిగడంతో గురుకుల పాఠశాల పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి.
ఘటన తీవ్రతను గుర్తించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థినులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి నుంచి వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తానని, బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
బాలికల భద్రతపై నిర్లక్ష్యం?
ప్రభుత్వ గురుకులాల్లోనే బాలికలకు భద్రత కరువైతే.. ఇక పేదలు తమ పిల్లలను ఎక్కడికి పంపాలంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడికి కఠిన శిక్ష పడటంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన గురుకుల అధికారులపై తక్షణమే వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సంక్షేమం పేరుతో నడిచే విద్యాసంస్థల్లో చిన్నారుల భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలనీ అంటున్నారు.
పోలీసుల దర్యాప్తు.. అదుపులో నిందితుడు..
మరోవైపు బాధిత బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కనగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య కార్మికుడు సతీష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తూ ఘటనకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.