ఇదెక్కడి విడ్డూరం.. పౌడర్ రాసుకుంటేనే పనిచేసినట్టు లెక్క! లేదంటే పస్తులే

ఆదిలాబాద్ ఉపాధి హామీ కూలీలు NMMS యాప్ ముఖ హాజరు కోసం టాల్కమ్ పౌడర్ వాడుతున్నారు. చెమట, సాంకేతిక సమస్యల వల్ల ఫేస్ రికగ్నిషన్ అవ్వకపోవడంతో వేతనాలు కోల్పోతున్నారు. ఈ వినూత్న పరిష్కారం క్షేత్ర సహాయకుడిదే అయినా, ఇది కూలీల కష్టాలను పెంచుతోంది.

ఇదెక్కడి విడ్డూరం.. పౌడర్ రాసుకుంటేనే పనిచేసినట్టు లెక్క! లేదంటే పస్తులే
Mnrega Facial Recognition

Edited By:

Updated on: Apr 25, 2026 | 10:24 PM

ఆ జిల్లాలో‌ ఉపాధి హామీ పనులకు వెళుతున్న కూలీలంతా పౌడర్ డబ్బా వెంట తీసుకెళుతున్నారంట. అదేంటీ ఉపాది హామీ కూలీకి పౌడర్ డబ్బాలతో పనేంటి అనే కదా డౌట్. ఆ అక్కడికే వస్తున్నాం.. ముఖం నిండా పౌడర్ రాసుకుంటే తప్ప చేసిన కష్టానికి కూలీ దొరకడం లేదంట. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన‌ ముఖ ఆధారిత హాజరు, అదేనండి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేసింది కదా.. ఆ యాప్ కష్టాలే ఇవన్ని. భగ్గున మండే ఎండల్లో మొఖం అంతా జిడ్డుగా మారేలా కాయకష్టం చేస్తున్న కూలీల ఫేస్ హాజరు నమోదు కాకపోవడంతో ఇదిగో‌ ఇలా ముఖం అంతా పౌడర్ రాసుకొని ఫోటోలు దిగక తప్పడం లేదంటా. ఇంతకీ ఎక్కడ ఈ పరిస్థితి తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు‌ వెళ్లాల్సిందే.

ఫోన్ కెమెరా ముందు మఖం నిండా పౌడర్ రాసుకున్న ఓ వ్యక్తి.. ఆ వ్యక్తి వెనుక టవల్ పట్టుకుని నిలుచున్న మరో ఇద్దరు వ్యక్తులు.. అంతలోనే సెల్ ఫోన్ లో క్లిక్ మన్న ఫోటో. ఇలా చేస్తే కానీ చేసిన పనికి కూలీ‌రాని పరిస్థితి. ఎర్రని‌ ఎండలు చెమటోడ్చి పని చేసినా ఫోటో దిగితే తప్ప హాజరు నమోదు కానీ పరిస్థితి. ఇక్కడ అక్కడ అని కాదు దేశమంతా ఇదే సమస్య.. ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అయితే ఆ సమస్య మరింత తీవ్రం. అలాంటి కఠిన‌ సమస్యకు ఇలా పౌడర్ తో పరిష్కారం చూపారు ఇక్కడి ఉపాధిహామీ పథకం అధికారులు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామికులకు ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేసింది. పని ప్రదేశంలో సాంకేతిక సమస్యలతో పాటు పేస్ అటెండెన్స్ నమోదు సరిగ్గా కాకపోవడంతో కొంతమంది ఇళ్లకు తిరిగెళ్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పొలాస, జామ్ని పంచాయతీల క్షేత్ర సహాయకుడు బాబు వినూత్నంగా ఆలోచించి ముఖ ఆధారిత నమోదు కోసం శ్రామికుల ముఖాలపై టాల్కమ్ పౌడర్ చల్లుకోవాలంటూ సూచించాడు. ఆ వెంటనే తెల్లగా మారిన కూలీ మొఖాన్ని ఫోన్ లో క్యాప్చర్ చేశాడు‌ అంతే.. ఉపాధి కూలీ అటెండెన్స్ మ్యాచింగ్ క్షణాల్లో అయిపోయింది.

అంతే ఉపాధి హామీ కూలీకి వస్తున్న కూలీలంతా ఫేస్ అటెండెన్స్ సరిగా రావాలంటే వెంట టాల్కం పౌడర్ డబ్బా తెచ్చుకోవాలంటూ సూచించారు సిబ్బంది. దీంతో‌ ఇదెదో బాగుందని కూలీ కష్టాలు తప్పెలా ఉన్నాయని భావించి ఉపాధి ‌హామీ పనికి వెళుతున్న కూలీలంతా తమ వెంట పౌడర్ డబ్బాలు తెచ్చుకుంటున్నారంట. అయితే ఉపాది హామీ కూలీలకు ఈ ఫోటో హాజరు రద్దు చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈపద్దతి కూలీల కడుపుకొట్టడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 1 నుంచి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కింద పనిచేసే కూలీలకు ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ (NMMS) యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేసింది. నాటి నుంచీ ఈ విధానం వల్ల కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు పూటలా ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. ‘పని ప్రారంభంలో ఒకసారి, పని ముగిశాక రెండోసారి జియోట్యాగ్డ్, టైమ్‌స్టాంప్డ్ ఫొటోలను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి’ అని కేంద్రం నిబంధనలు పెట్టడంతో ఆదిలాబాద్ , ఆసిపాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్‌ సరిగ్గా లేక… సర్వర్లు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఎండ కాలంలో చెమట కారణంగా మొఖం నల్లగా మారడంతో ఫోటో అప్లోడ్ అవడం లేదు. దీంతో ఉపాధి హామీ సిబ్బంది, కూలీలకు ఈ ఫొటో అప్‌లోడింగ్‌ ప్రక్రియతో తిప్పలు తప్పడం లేదు. ఇలాంటి సాంకేతిక కారణాల వల్ల కేవలం ఒక పూట మాత్రమే ఫొటో అప్‌లోడ్ అయితే, ఆ రోజుకు ఉపాధి కూలీలు తమ సగం వేతనం కోల్పోవాల్సి వస్తుంది. రెండు పూటలా అప్‌లోడ్‌ కాకపోతే ఆ రోజు వేతనాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. ఈ సమస్యకు కేంద్ర శాశ్వతం పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు ఉపాధి హామీ కూలీలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us