
వ్యవసాయం పాత పద్ధతులకు పరిమితం కాకుండా, మార్పును స్వీకరించినప్పుడే లాభాల బాట పడుతుందని నిరూపిస్తున్నారు నల్గొండ జిల్లా పెద్దపూరకు చెందిన రైతు మిట్టపల్లి శ్రీనివాస్. తన వినూత్న సమీకృత వ్యవసాయ పద్ధతులతో ప్రభుత్వ ఉద్యోగికి తీసిపోని విధంగా ప్రతి నెలా లక్ష రూపాయల నికర ఆదాయాన్ని ఆర్జిస్తూ అనేకమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీనివాస్ తన 20 ఎకరాల వ్యవసాయ భూమిలో బత్తాయి, దొండ, పామాయిల్ తోటలను సాగు చేస్తున్నారు. గతంలో పట్టుపురుగుల పెంపకాన్ని కూడా చేపట్టినప్పటికీ, పట్టుగూళ్లకు సరైన ధర లభించకపోవడం, కూలీల కొరత తీవ్రం కావడంతో ఆ వ్యాపారాన్ని నిలిపివేశారు. కొత్త అవకాశాల కోసం అన్వేషణలో భాగంగా ఆయన దృష్టి నాటుకోళ్ల పెంపకంపై పడింది. లోతైన పరిశోధన తర్వాత, తెలంగాణ వాతావరణానికి అత్యంత అనుకూలమైన సోనాలి జాతి కోళ్లను ఎంచుకొని పెంపకం ప్రారంభించారు. పట్టుపురుగుల కోసం నిర్మించిన ప్రత్యేక షెడ్డునే నాటుకోళ్ల పెంపకానికి ఉపయోగించడం ద్వారా ఆయన పెట్టుబడిని భారీగా తగ్గించుకున్నారు. శ్రీనివాస్ పెంపకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఓపెన్ రేంజ్ పద్ధతిలో జరుగుతుంది. ఉదయం ఆరు గంటలకు కోళ్లను షెడ్డు నుంచి బయటకు వదిలి, సాయంత్రం ఆరున్నర గంటలకు తిరిగి లోపలికి తోలుతారు. పచ్చని బత్తాయి, దొండ తోటల్లో స్వేచ్ఛగా తిరగడం వల్ల కోళ్లు తమకు కావాల్సిన ఆహారాన్ని తామే వెతుక్కుంటాయి. దీనివల్ల దాణా ఖర్చు తగ్గడంతో పాటు, కోళ్లు చురుకుగా ఉండి కొవ్వు పేరుకుపోకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి.
అంతేకాకుండా, తోటల్లోని పాములు, తేళ్లు వంటి వాటిని కోళ్లు తినడం వల్ల తోటలు శుభ్రంగా ఉంటాయని శ్రీనివాస్ వివరిస్తున్నారు. దాణా విషయంలోనూ శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్థానికంగా లభించే జొన్నలు, సజ్జలు, నూకలతో పాటు తమ తోటల్లో పండే పొప్పాయి, దొండ వంటి కూరగాయలకు మార్కెట్లో ధర లేనప్పుడు వాటిని కోళ్లకు ఆహారంగా అందిస్తారు. ఇది దాణా ఖర్చును బాగా తగ్గిస్తుంది. సుమారు 100 రోజుల్లో కోడి పిల్లలు 1.3 కిలోల నుంచి 1.5 కిలోల బరువుకు చేరుకుంటాయి. ఈ సమయంలోనే వాటిని మార్కెట్ చేస్తామని, మరింత ఆలస్యం చేస్తే కోడి దాణా ఎక్కువ తిని, బరువు పెరగకుండా నష్టం వస్తుందని ఆయన తెలిపారు. కోడిగుడ్ల విక్రయాల ద్వారా కూడా శ్రీనివాస్ మంచి ఆదాయం పొందుతున్నారు. సుమారు 200 కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించాక, రోజుకు 100 నుంచి 120 గుడ్లు వస్తున్నాయి. మొదట్లో ప్రజలకు నాణ్యత, రుచి తెలియజేయడానికి ఉచితంగా అందించిన గుడ్లకు తర్వాత మంచి డిమాండ్ ఏర్పడింది. సాధారణ బ్రాయిలర్ గుడ్లు రూ.6-7కు అమ్ముడవుతున్న రోజుల్లో, శ్రీనివాస్ గుడ్లను ఒక్కోటి రూ.10 చొప్పున విక్రయిస్తూ రోజుకు కనీసం రూ.500 ఆదాయం పొందుతున్నారు.
ఈ వ్యాపారంలో పెట్టుబడి, లాభాల గురించి శ్రీనివాస్ స్పష్టంగా వివరించారు. కోడి పిల్లలకు లక్ష రూపాయలు, షెడ్డుకు లక్ష రూపాయలు, దాణాకు లక్ష రూపాయలు – మొత్తం రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే, నాలుగు నెలల తర్వాత రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆయన అంచనా. ఒక్కో కోడిపై రూ.200-220 పెట్టుబడి అవుతుండగా, హోల్‌సేల్ డీలర్లకు రూ.350, రిటైల్‌గా అయితే రూ.400 వరకు విక్రయిస్తారు. అన్ని ఖర్చులు పోను ఒక్కో కోడిపై కనీసం రూ.100 నుండి రూ.150 వరకు నికర లాభం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, కేవలం ఒకే పంట లేదా ఒకే వ్యవసాయ పద్ధతితో బతకడం ఈ రోజుల్లో అసాధ్యమని శ్రీనివాస్ అన్నారు. తన బత్తాయి తోట కారణంగా రోజు తోటకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి, కోళ్ల పెంపకానికి అదనపు శ్రమ అవసరం లేదని, అవే తోటలో స్వేచ్ఛగా పెరుగుతాయని తెలిపారు. ఈ సమీకృత పద్ధతి ద్వారా తన కుటుంబం బతకడంతో పాటు, నలుగురు ఇతర కుటుంబాలకు కూడా ఉపాధి కల్పించగలుగుతున్నానని గర్వంగా చెబుతున్నారు. మార్పును ఆహ్వానిస్తే వ్యవసాయంలో లాభాల పండగ ఎంతో దూరంలో లేదని రైతు శ్రీనివాస్ నిరూపిస్తున్నారు.