నిధుల కోసం తవ్వకాలు.. ధ్వంసమవుతున్న వేల ఏళ్ల చరిత్ర.. మోత్కూరులో అసలేం జరుగుతోంది?

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని రాకాసి బొళ్ల సమీపంలో బృహత్ శిలాయుగం నాటి పురాతన సమాధులు వెలుగులోకి వచ్చాయి. రాతి పలకలతో నిర్మించిన ఈ సమాధులు వేల ఏళ్ల నాటి మానవ నాగరికతకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. రాతి పనిముట్ల తయారీ ఆధారాలు కూడా గుర్తించారు. మరోవైపు గుప్తనిధుల వేటలో చారిత్రక కట్టడాలు ధ్వంసమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

నిధుల కోసం తవ్వకాలు.. ధ్వంసమవుతున్న వేల ఏళ్ల చరిత్ర.. మోత్కూరులో అసలేం జరుగుతోంది?
Motkur Megalithic Burials

Edited By:

Updated on: Nov 10, 2026 | 11:49 AM

వేల ఏళ్ల క్రితం.. మనిషి నాగరికత తొలి అడుగులు వేస్తున్న కాలంలో లిపి లేదు.. ఆధునిక సాంకేతికత లేదు. కానీ తమ ఉనికికి ఆనవాళ్లుగా రాతి నిర్మాణాలను వదిలివెళ్లారు ఆనాటి మనుషులు. అలాంటి బృహత్‌ శిలాయుగం నాటి సమాధులు ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వెలుగు చూశాయి. రాతి పలకలతో నిర్మించిన ఈ సమాధులు.. ఆనాటి మానవుల జీవన విధానం, సామాజిక ఆచారాలు, పద్ధతులపై కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటేనే చారిత్రక, సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. కాకతీయుల కాలం నుంచి శాతవాహనుల ఆనవాళ్ల వరకు ఎన్నో చారిత్రక విశేషాలకు ఈ ప్రాంతం నిలయం. ఇప్పుడు అదే నేలపై బృహత్‌ శిలాయుగం నాటి సమాధులు వెలుగులోకి వచ్చాయి. యాదాద్రి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని రాకాసి బొళ్ల సమీపంలోనీ రాకాసి బండ, నాగుల బండ, కత్వ బండలపై మట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురావస్తు పరిశోధనలు కొనసాగుతున్నాయి. డిస్కవరీ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రెడ్డి రత్నాకరరెడ్డి బృందం చారిత్రక బృహత్‌ శిలాయుగపు సమాధులను గుర్తించింది.

రాతి పలకలతో సమాధుల నిర్మాణం..

ఈ సమాధుల నిర్మాణం చూస్తేనే ఆనాటి మనుషుల ప్రత్యేక నిర్మాణ నైపుణ్యం అర్థమవుతుంది. పెద్ద పెద్ద రాతి పలకలను సగం భూమిపైన, సగం భూమిలోపల అమర్చి.. వాటిపై మరో భారీ బండరాయిని కప్పుగా ఏర్పాటు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి నిర్మాణాలను బృహత్‌ శిలాయుగపు సమాధులుగా పరిగణిస్తారు. ఆనాటి మానవులు మరణించిన వారిని గౌరవప్రదంగా ఖననం చేసేందుకు ప్రత్యేక పద్ధతులను అనుసరించేవారని పురావస్తు పరిశోధనలు చెబుతున్నారు. ఈ నిర్మాణాలు కేవలం సమాధులే కాదు.. ఆనాటి మానవ సమాజపు ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్నాయి.

రాతి పనిముట్ల తయారీ ఆనవాళ్లు..

ఇక్కడ మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను పరిశోధకులు గుర్తించారు. సమాధులతో పాటు రాతి బండలపై శిలాయుగం నాటి పని ముట్ల తయారీకి సంబంధించిన ఆనవాళ్లను కూడా పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు మానవ సంచారం మాత్రమే కాదు.. రాతి పనిముట్ల తయారీ వంటి కార్యకలాపాలు కూడా జరిగి ఉండవచ్చన్న పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో లభిస్తున్న రాతి నిర్మాణాలు, సమాధులు, ఇతర ఆనవాళ్లపై మరింత శాస్త్రీయ పరిశోధన జరిగితే ఆనాటి మానవుల జీవన విధానం గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

గుప్తనిధుల వేటలో చరిత్రకు నష్టం..

ఒకవైపు వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న పురాతన సమాధులు వెలుగులోకి వస్తుంటే.. మరోవైపు గుప్తనిధుల పేరుతో జరుగుతున్న తవ్వకాలు వాటి ఉనికికే ప్రమాదంగా మారుతున్నాయి. గుప్తనిధులు లభిస్తాయన్న ఆశతో కొందరు జరిపిన తవ్వకాల కారణంగా ఈ ప్రాంతంలో అనేక సమాధులు ధ్వంసమైనట్లు పరిశోధకులు గుర్తించారు. నిధుల కోసం దురాశతో జరిపిన తవ్వకాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన పలు సమాధులను అసాంఘిక శక్తులు ధ్వంసం చేయడం పట్ల పురావస్తు పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ నిర్మాణాల విలువ వాటిలో నిధులు ఉండటంలో లేదు.. వాటి వెనుక దాగివున్న చరిత్రలో ఉందనీ పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు.

చరిత్రను కాపాడుకోవాల్సిన సమయం..

ఒక్కసారి ధ్వంసమైతే తిరిగి నిర్మించలేని ఇలాంటి చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. పురావస్తు శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి, వీటి కాలాన్ని నిర్ధారించడంతో పాటు పరిరక్షణ చర్యలు చేపట్టాలనీ పురావస్తు ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానికులు, అధికారులు స్పందించి మిగిలివున్న ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాలని రత్నాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మోత్కూరు ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ సమాధులు ఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రలో మరో ఆసక్తికరమైన అధ్యాయానికి తెరతీస్తున్నాయి. ఇప్పటివరకు స్థానికులకు కూడా పెద్దగా తెలియని ఎన్నో చారిత్రక ఆనవాళ్లు ఇలా పరిశోధనల ద్వారా బయటపడుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us