చేసిందంతా చేసి.. రౌడీయిజానికి కొత్త భాష్యం చెప్పిన మోహన్ బాబు

|

Dec 12, 2024 | 7:09 PM

టీవీ9 రిపోర్టర్‌ రంజిత్‌పై దాడి ఘటనపై మోహన్‌బాబు మరో డ్రామాకు తెరతీశారు. మైక్‌ను మారణాయుధంగా ఉపయోగించి ఇప్పుడు మాట మార్చేశారు.

చేసిందంతా చేసి.. రౌడీయిజానికి కొత్త భాష్యం చెప్పిన మోహన్ బాబు
Mohanbabu Attack On Tv9 Ranjith
Follow us on

టీవీ9 రంజిత్‌పై దాడి ఘటనపై మోహన్‌బాబు మరో డ్రామాకు తెరతీశారు. మైక్‌ను మారణాయుధంగా ఉపయోగించి ఇప్పుడు మాట మార్చేశారు. ఈ ఘటనపై చింతిస్తున్నానన్నారు మోహన్‌బాబు. తన ఇంట్లోకి వచ్చి.. తన ఏకాగ్రతకు భంగం కల్గించడంతోనే దాడి చేశానని తెలిపారు. తన ఇంట్లోకి వచ్చింది టీవీ9 రిపోర్టరా.. మరెవరైనానా అని తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మోహన్‌బాబు తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అసలు మైక్‌కి.. మోహన్‌బాబుకి మధ్య చాలా గ్యాప్‌ ఉంది. విజువల్స్‌ చూస్తున్న ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. మీడియా ప్రతినిధులపై చేసిన దాడిపై పశ్చాత్తాపం లేకుండా.. వచ్చింది టీవీ9 రిపోర్టరా? కాదో తనకు తెలియదని బుకాయిస్తున్నారు మోహన్‌బాబు. మేటర్‌ సీరియస్‌ కావడంతో ఇప్పుడు చింతిస్తున్నానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

దాడి జరిగిన రోజు టీవీ9 ప్రతినిధి రంజిత్‌ పట్టుకున్న మైక్‌.. మోహన్‌బాబుకు మధ్య కనీసం అర మీటర్‌ వరకు గ్యాప్‌ ఉంది. కానీ వస్తూనే ఒక్కసారిగా దాడి చేశాడు మోహన్‌బాబు. తలపై తీవ్రంగా కొట్టి.. ఇప్పుడు వచ్చింది మీడియానో కాదో తెలియదంటూ బుకాయిస్తున్నాడు. పోలీస్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో ఈ దాడి ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు మోహన్‌బాబు.

పొరపాటున కాలోచెయ్యో తాకితేనే సారీచెబుతాం. బట్‌.. జర్నలిస్టులపై జులుం ప్రదర్శించిన జల్‌పల్లి రౌడీ మాత్రం.. అలాంటివి మన ఇంటావంటా లేవన్నట్లే ఉన్నారు. హత్యాయత్నానికి పాల్పడి హాస్పిటల్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. డాడీకి ఎవరు ఎదురొచ్చినా వారికే రిస్క్‌ అన్నట్లుంది ఆయన కొడుకు మంచు విష్ణు తీరు. తండ్రి మాటే వేదవాక్కంటున్న విష్ణు రియాక్షన్‌. బజారురౌడీలా బరితెగించేసిన పెదరాయుడిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మోహన్‌బాబుపై యాక్షన్‌ తీసుకోవాలంటూ రోడ్డెక్కారు తెలుగురాష్ట్రాల పాత్రికేయులు.

టీవీ9 రిపోర్టర్‌ రంజిత్‌పై హత్యాయత్నానికి పాల్పడిన మోహన్‌బాబు తీరుని యావత్ మీడియా ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. అటు నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ సైతం మోహన్‌బాబు తీరుతోపాటు అక్కడే ఉండి ప్రేక్షకపాత్ర వహించిన పోలీసుల తీరును తప్పుబట్టారు. జర్నలిస్ట్‌ రంజిత్‌పై చేసిన మాటలదాడి, భౌతికదాడి హేయమైనదని NBF ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి వ్యక్తులపై చేస్తున్నవి దాడులు కాదు, జర్నలిజం సిద్ధాంతాలు, స్వేచ్ఛపై చేస్తున్న దాడిగా ఎన్‌బీఎఫ్ పేర్కొంది. సంబంధిత ప్రభుత్వ శాఖలు మోహన్‌బాబు ఘటనను సీరియస్‌గా తీసుకోవాలన్న కోరింది. దాడి సమయంలో పక్కనే ఉండి కూడా పట్టించుకోని పోలీసులూ ఘటనకు బాధ్యులేనన్న NBF తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి దాడుల్ని నిరోధించేలా కఠినచట్టం కావాలని NBF డిమాండ్‌ చేసింది.

ఇదిలావుంటే, ఏడుపదుల వయసున్న వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉండాలి. తన కుటుంబసమస్య రోడ్డునపడ్డప్పుడు ఎంత సంయమనంతో వ్యవహరించాలి. పైగా ఆయనేం దారినపోయే దానయ్య కాదు. ఫిప్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ. ఏమైపోయింది విజ్ఞత? ఎటుపోయింది సంస్కారం? ఇంటి పంచాయితీ తీర్చలేని పెదరాయుడు.. జర్నలిస్టులపై రౌడీయిజం చేయడమేంటి? తెలుగురాష్ట్రాల్లో ఎవరిని కదిపినా ఇప్పుడిదే ప్రశ్న. మంచుమనోజ్‌ సారీ చెప్పారు. విష్ణు మాత్రం డాడీ కరెక్ట్‌, పర్‌ఫెక్ట్‌ అంటున్నారు.

జర్నలిస్టుపై హత్యాయత్నానికి తెగబడ్డ మోహన్‌బాబు హాస్పిటల్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. కాదు కాదు.. మెడికల్‌ బులెటిన్ల పరిభాషలో చికిత్స పొందుతున్నారు. వీరావేశంతో వీధి రౌడిలా జర్నలిస్టులపై విరుచుకుపడ్డ మోహన్‌బాబు.. సీన్‌ కట్‌ చేస్తే ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారు. ఆరోగ్యం బాలేదని, ఆయనకు గాయాలయ్యాయని, రక్తపోటుకూడా తీవ్రంగా ఉందని చెబుతున్నారు. కారణమేదయినా ఇంటి పంచాయితీ తీర్చాల్సిన పెదరాయుడు ప్రస్తుతానికి కేరాఫ్‌ హాస్పిటల్‌. తలకు తీవ్రగాయాలతో టీవీ నైన్‌ జర్నలిస్ట్‌ రంజిత్‌కి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టైంలో.. దాడికి పాల్పడ్డ నిందితుడు ఆస్పత్రిలో చేరడం.. వింతగానే ఉంది అందరికీ..!

ఇక, జరిగిన సంఘటనపై తండ్రీ కొడుకులు మోహన్ బాబు, మంచు విష్ణుకు కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు. తన తండ్రి ఏం చేసినా కరెక్టేనన్నట్లు సమర్థించారు పెదరాయుడి పెద్దకొడుకు. తనకు, తన భార్యాపిల్లలకు రక్షణ కల్పించాలని ఓపక్క మంచు మనోజ్‌ పోలీసుల అధికారులను వేడుకుంటుంటే.. ఆయనతోపాటు మీడియా గేటు దాటి లోపలికి రావడమే తప్పన్నట్లుంది విష్ణు వితండవాదన. దగ్గరికొచ్చి దండపెట్టిన పెద్దమనిషి ఇది తమ ఇంటి సమస్యనో, మాలో మేము పరిష్కరించుకుంటామనో చెప్పుంటే గౌరవంగా ఉండేది. మా ఇల్లు మా ఇష్టం అన్నట్లు జల్‌పల్లిలో జులుం ప్రదర్శించారు రౌడీ బాబు.

ఆ దెబ్బ ఇంకొంచెం బలంగా తాకి ఉంటే జర్నలిస్ట్‌ ప్రాణాలకు హాని కలిగేది. అయినా కొట్టడం తమ జన్మ హక్క అన్నట్లు వకాల్తా పుచ్చుకున్నారు మంచు విష్ణు. ఇంటి బయట ఆందోళనకు దిగిన జర్నలిస్టుల దగ్గరికి మంచు మనోజ్‌ వచ్చి సంఘీభావం ప్రకటించారు. జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తంచేశారు. తండ్రి, అన్న తరపున క్షమాపణలు కోరుకున్నారు. ఇంట్లో తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. కానీ మంచు విష్ణు వ్యవహారం దీనికి పూర్తి రివర్స్‌. తండ్రి ఆస్పత్రిలో చేరితే మీడియా ముందుకొచ్చిన విష్ణు కనీసం జరిగిన సంఘటనపై పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు.

నిజానికి మీడియా ప్రతినిధులు తమకు తాముగా మోహన్‌బాబు ఇంటికి వెళ్లలేదు. మంచు మనోజ్‌ తీసుకెళ్తేనే వెళ్లారు. తన తండ్రి మోహన్‌బాబు బౌన్సర్లతో తనపై దాడి చేయిస్తున్నాడని మనోజ్‌ మీడియాను తన వెంట తీసుకెళ్లాడు. మొదట మంచు మనోజ్‌ గేట్లు బద్దలుకొట్టి లోనికి వెళ్లాడు. ఆ తర్వాతే మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. అయితే దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుని మరో డ్రామాకు తెరతీశాడు మోహన్‌బాబు.

ఇదిలాఉండగా, విచక్షణారహితంగా, అత్యంత పాశవికంగా మోహన్‌బాబు జరిపిన దాడితో తీవ్ర గాయమై ఆస్పత్రి పాలైన టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌కు దవడ పైభాగంలో సర్జరీ జరిగింది. రంజిత్‌కి యశోద ఆస్పత్రి వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. ఫ్రాక్చర్‌ అయినచోట స్టీల్‌ ప్లేట్‌ అమర్చారు. మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. కంటికి, చెవికి మధ్య ఫ్రాక్చర్‌ కావడంతో సర్జరీకి మూడు గంటల సమయం పట్టినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మూడు, నాలుగు రోజులపాటు రంజిత్‌ను వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఇక.. సర్జరీ తర్వాత కూడా టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ పరామర్శించారు. రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు రజనీకాంత్‌కు వివరించారు. కేవలం ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నామని, దవడ పైభాగం లోపల బాగా దెబ్బతిన్నదని, కోలుకోవడానికి ఎంత సమయం పట్టేదీ అప్పుడే చెప్పలేమని వైద్యులు రజినీకాంత్‌కు వివరించారు. అటు రంజిత్‌ను తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ నేతలు పరామర్శించారు. రంజిత్‌కు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. మానవత్వం లేకుండా బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయమైందని.. ఇలాంటి దాడులు సహించరానివన్నారు TUWJ అధ్యక్షులు విరహత్‌ అలీ.

మరోవైపు.. మోహన్‌బాబు రౌడీయిజంపై అన్ని వర్గాలూ భగ్గుమంటున్నాయి. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై మోహన్‌బాబు దాడిని ఖండిస్తూ నిరసన తెలుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్ధులు. మోహన్‌బాబు దాడికి వ్యతిరేకంగా జర్నలిస్టుల సంఘాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటు శ్రీకాకుళంలో జర్నలిస్టులకు అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తిలోనూ ఆందోళనకు దిగాయి జర్నలిస్ట్‌ సంఘాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆందోళనకు దిగారు జర్నలిస్టులు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి వామపక్ష నేతలు మద్దతు పలికారు. కరీంనగర్‌లోనూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మొత్తంగా..టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి చేసిన మోహన్‌బాబును వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు, జర్నలిస్ట్‌ సంఘాల నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..