
మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడం.. అనంతరం గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకల శ్రీనివాస్ (40) ఈ నెల 20న స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి ఇంటి నుంచి మంచిర్యాలకు వెళ్లాడు. అయితే రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో బందువుల ఇళ్లలో గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో శ్రీనివాస్ ఆచూకీ కోసం నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ అయిన రోజే రాత్రి సుమారు 8 గంటల సమయంలో చెన్నూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర వైన్స్ వద్ద శ్రీనివాస్ కనిపించినట్లు సమాచారం. అక్కడ తన దూరపు బంధువు గోదరి సమ్మయ్యతో కలిసి మద్యం సేవించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత శ్రీనివాస్ ఎక్కడికి వెళ్లాడు..? ఎవరిని కలిశాడు..? ఏం జరిగింది..? అనే విషయాలు ప్రస్తుతం మిస్టరీగా మారాయి.
శ్రీనివాస్ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తుండగా.. తాజాగా శనివారం చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి ఘటనాస్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
శ్రీనివాస్ మృతికి అసలు కారణం తెలుసుకునేందుకు పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, మిస్సింగ్ ఫిర్యాదు వివరాలు, చివరిసారిగా శ్రీనివాస్‌తో ఉన్న వ్యక్తుల వివరాలు, అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..