
కాలం మారింది.. జీవన విధానాలు మారాయి.. ప్రపంచం ఆధునికత వైపు పరుగులు తీసింది. ఈ మార్పులన్నింటినీ కళ్లారా చూస్తూ.. నాలుగు తరాలకు ఆప్యాయతను పంచుతూ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన సోప్పరి నర్సవ్వ. వందేళ్ల జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆమెకు కుటుంబ సభ్యులు ఘనంగా శత వసంతాల వేడుకలు నిర్వహించారు.
నర్సవ్వ తన జీవిత ప్రయాణంలో ఎన్నో కాలమాన మార్పులను చూశారు. ఒకప్పుడు ఉన్న జీవన విధానాల నుంచి నేటి ఆధునిక ప్రపంచం వరకు సమాజంలో వచ్చిన అనేక పరిణామాలకు సాక్షిగా నిలిచారు. వందేళ్ల వయసులోనూ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ఆమె శత వసంతాల వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి.
నర్సవ్వ కుమారులు గంగాధర్, గంగారం, సత్తయ్య, బలరాంతో పాటు కుమార్తె కాశవ్వ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ పెద్దకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరడంతో వేడుకలు సందడిగా సాగాయి.
నాలుగు తరాలను చూసిన నర్సవ్వ జీవిత ప్రయాణం కుటుంబ సభ్యులకు మధుర జ్ఞాపకంగా నిలిచింది. వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆమె మరిన్ని రోజులు ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య గడపాలని బంధువులు, కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.