
జీవితం అందరికీ పూలబాట పరచదు.. కొందరికి ముళ్లబాటలోనే పయనించడం నేర్పిస్తుంది. కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా.. కన్నీళ్లు వచ్చినా చెదిరిపోకుండా.. బాధ్యతల బరువును చిరునవ్వుతో మోసేవారే నిజమైన జీవిత పోరాట యోధులు. అలాంటి ఓ మాతృమూర్తి కథ ఇది. ఒకవైపు ఇద్దరు పసి పిల్లల ఆలనాపాలన.. మరోవైపు కుటుంబ పోషణ కోసం ఉద్యోగం.. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది నిర్మల్‌కు చెందిన అశ్వినిగణేశ్. చేతిలో చీపురు పట్టుకుని వీధులు ఊడ్చకపోయినా.. చెత్త సేకరించే మున్సిపల్ వాహనానికి స్టీరింగ్ పట్టుకుని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను భుజాన వేసుకుంది.
తెల్లవారుజామునే అశ్వినిగణేశ్ దినచర్య ప్రారంభమవుతుంది. ఇంట్లో ఇద్దరు చిన్నారులు.. వారిని వదిలి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు పని చేయకపోతే కుటుంబాన్ని పోషించలేని ఆర్థిక అవసరం. ఈ రెండు బాధ్యతల మధ్య ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం ఎంతో ప్రత్యేకం. పిల్లలను ఇంట్లో వదిలేసి వెళ్లడం కంటే తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. మున్సిపల్ చెత్త సేకరణ వాహనంలోనే ఇద్దరు చిన్నారులను కూర్చోబెట్టుకుని విధులకు బయలుదేరుతుంది. ఒకవైపు పిల్లలపై కన్నేసి ఉంచుతూనే మరోవైపు వాహనం స్టీరింగ్ తిప్పుతూ తన విధులను నిర్వర్తిస్తోంది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్, రవినగర్, గొల్లపేట్, రెడ్డి కాలనీ, దివ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ చెత్త సేకరిస్తోంది. మున్సిపల్ కాంట్రాక్టర్ అందించిన వాహనంతో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. రోజంతా రోడ్లపై ప్రయాణం.. ఎండ, వానను లెక్కచేయని విధులు.. అయినా ముఖంలో మాత్రం చెరగని చిరునవ్వు. అయితే ఆమె ప్రయాణం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో బాధ్యతలు దాగి ఉన్నాయి.
సాధారణంగా ఉద్యోగం చేసే తల్లులు పిల్లలను ఇంట్లో కుటుంబసభ్యుల వద్ద వదిలి వెళ్తుంటారు. కానీ అశ్వినికి అలాంటి అవకాశం లేకపోవడంతో పిల్లలను తనతోనే తీసుకెళ్తుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ విధులను కొనసాగిస్తుంది. కుటుంబ బాధ్యతలను తప్పించుకోకుండా, పరిస్థితులకు తలవంచకుండా తన కాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయాణం కేవలం ఉపాధి కోసం సాగుతున్న ప్రయాణం మాత్రమే కాదు.. ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం ఓ తల్లి చేస్తున్న పోరాటం. చెత్తను సేకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ఆమె.. తన జీవితంలో ఎదురైన కష్టాలను కూడా ధైర్యంతో అధిగమిస్తోంది. ఎంతోమంది తమ సమస్యలకు నిరాశ చెందుతుంటే.. అశ్విని మాత్రం సమస్యలనే సవాళ్లుగా స్వీకరిస్తుంది. ఆమె చేతిలోని స్టీరింగ్ కేవలం ఓ వాహనాన్ని నడిపించడం లేదు.. ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తోంది. తన పిల్లల భవిష్యత్తును మాత్రం బంగారంలా తీర్చిదిద్దాలన్నదే ఆమె ఆశయం. కష్టాలు ఎన్ని ఎదురైనా.. అమ్మతనం ముందు అవన్నీ చిన్నవేనని నిరూపిస్తున్న అశ్వినికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.