Telangana: కామాంధులు బరితెగిస్తున్నారు. కీచకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. గుడి.. బడి అన్న తేడా లేకుండా రెచ్చిపోతున్నారు ఉన్మాదులు. నగరంలో జరిగిన లేటెస్ట్ ఇన్సిడెంట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ మొయిన్ బాగ్(Moin Bagh) యూనిక్ హైస్కూల్లో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు స్కూల్ ఇన్చార్జ్ కుమారుడు యాసిర్. చాక్లెట్, బిస్కెట్లు ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. పలువురు బాలికలపై లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు న్యూడ్ వీడియోస్ ఫోన్లో చిత్రీకరించి విద్యార్థినులపై బెదిరింపులకు దిగుతున్నాడు. పాఠశాలలోనే నిందితుడి కుటుంబం నివాసం ఉండటంతో రెచ్చిపోయాడు. స్టూడెంట్స్ తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించడంతో బండారం బయటపడింది. నిందితుడు యాసిర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. సెక్షన్ 354(a), 509, 9(m) r/w పోక్సో యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేశారు. పలు న్యూడ్ సెల్ఫీ వీడియోస్ స్వాధీనం చేసుకున్నారు. యాసిర్ విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు ముందుగా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాసిర్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. పిల్లల పేరెంట్స్ ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదు మేనేజ్మెంట్. వేధింపులు మరింత ఎక్కువ కావడంతో విషయాన్ని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యాసిర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..