Hyderabad Police: భాషా సమస్యలకు చెక్.. ఏఐ కాప్‌రైటర్ యాప్‌తో హైదరాబాద్ పోలీసుల నూతన అడుగు

పోలీసు సేవల్లో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ యాప్‌ను ప్రారంభించారు. 10కిపైగా భాషల్లో ఫిర్యాదులను నమోదు చేసే ఈ “ఏఐ కాప్‌రైటర్” యాప్ ద్వారా బాధితుల మాటలను వెంటనే టెక్స్ట్‌గా మార్చి అనువదించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మొదటి దశలో 80కిపైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

Hyderabad Police: భాషా సమస్యలకు చెక్.. ఏఐ కాప్‌రైటర్ యాప్‌తో హైదరాబాద్ పోలీసుల నూతన అడుగు
AI Complaint Recorder

Edited By:

Updated on: May 25, 2026 | 8:05 PM

పోలీసు వ్యవస్థలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా హైదరాబాద్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ యాప్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ఈ “ఏఐ కాప్‌రైటర్” యాప్‌ను ఆవిష్కరించారు. ఫిర్యాదుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, భాషా సమస్యల వల్ల ఎవరూ ఇబ్బందులు పడకుండా చేయడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఈ ఏఐ కాప్‌రైటర్ యాప్ ప్రత్యేకత ఏమిటంటే.. 10కిపైగా భాషల్లో ఫిర్యాదులను నమోదు చేసే సామర్థ్యం కలిగి ఉండటం. బాధితులు లేదా ఫిర్యాదుదారులు మాట్లాడిన విషయాలను వెంటనే టెక్స్ట్ రూపంలోకి మార్చి, అవసరమైన భాషలోకి అనువదించే సాంకేతికత ఇందులో అందుబాటులో ఉంది. దీంతో భాషా అడ్డంకుల కారణంగా ఫిర్యాదు చేయలేని పరిస్థితులకు చెక్ పడనుంది.

మొదటి దశలో హైదరాబాద్ పరిధిలోని 80కిపైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియను మరింత వేగంగా, కచ్చితంగా పూర్తి చేయడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు.. బాధితుడు, సాక్షి, నిందితుల వాయిస్‌లను వేర్వేరుగా గుర్తించి వివరాలను సేకరించే ప్రత్యేక ఫీచర్ కూడా ఈ యాప్‌లో ఉండనుంది. ఫిర్యాదుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆటోమేటిక్‌గా PDF రూపంలో సేవ్ చేసే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ యాప్ వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. “భాష న్యాయానికి అడ్డంకి కాకూడదు” అనే లక్ష్యంతో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థ సహకారంతో ఈ ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల వినియోగంలో హైదరాబాద్ పోలీసులు మరోసారి కొత్త దారిని చూపించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us