
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ దీపావళి గిఫ్ట్ అందించింది. హైదరాబాద్‌లో ఉండేవారికి ఇది భారీ శుభవార్తగా చెప్పవచ్చు. మీరు రోజూ మెట్రోలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటే.. ప్రయాణ ఛార్జీల నుంచి మీకు భారీగా డబ్బులు ఆదా కానున్నాయి. అదేంటంటే.. మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఒకే కార్డుపై ప్రయాణించేందుకు వీలుగా రేవంత్ సర్కార్ కామన్ పాస్‌లను ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టింది. అయితే ఈ ఉమ్మడి పాస్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజల నుంచి స్పందన రాలేదు. వీటిని తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పాస్ ధరలను తగ్గించాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తుండగా.. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పాస్ ధరలు సగానికి సగం తగ్గిస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటన చేసింది. దీపావళి రోజున నవంబర్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తగ్గించినట్లు వెల్లడించారు.
తొలుత మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు నెలవారీ ఉమ్మడి పాస్ ధర రూ.8,500గా ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ.8 వేలు అంటే చాలా ఎక్కువ. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది భారం కూడుకున్నది. దీంతో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయల మేరకు సామాన్యులకు అందుబాటులో ఉండేలా సగానికి సగం తగ్గించింది. ప్రస్తుతం నెలవారీ పాస్ ధరను రూ.4 వేలుగా ఫిక్స్ చేసింది. అంటే ఏకంగా రూ.4,500 తగ్గించింది. ఇక రోజువారీ ఉమ్మడి పాస్ ధర రూ.400గా గతంలో ఉండగా.. ఇప్పుడు రూ.275కి తగ్గించింది.
-రూ.4 వేల నెలవారీ పాస్ ధరలో మెట్రో వాటా రూ.3 వేలు, ఆర్టీసీ ప్రయాణాలకు రూ.వెయ్యి వినియోగించుకోవచ్చు. నెలలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పులకు ఇవి వర్తిస్తుంది
-రోజువారీ రూ.275 పాసులో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీకి రూ.75 వినియోగించుకోవచ్చు. పాస్ రోజుకు 4 సింగిల్ జర్నీలకు ఉపయోగపడుతుంది
-ఈ తగ్గింపు వల్ల నెలవారీ పాస్ వినియోగదారులకు రూ.4,500, రోజువారీ పాస్ ఉపయోగించేవారికి రూ.125 ఆదా కానున్నాయి