వీడు ఖాకీ కాదు కంత్రీ.. హర్యానాలో కేసు ఉందంటూ తీసుకెళ్లి.. సూర్యాపేటలో..

హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతూ సొంతంగా సూడో పోలీస్ వ్యవస్థను నడిపిస్తున్న రౌడీ షీటర్ నాగరాజు రఘు వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలో కేసు ఉందంటూ కూకట్‌పల్లికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.5.26 లక్షలు వసూలు చేసిన ఘటనతో ఈ ముఠా గుట్టురట్టైంది. దర్యాప్తులో నకిలీ గుర్తింపు కార్డులు, పోలీస్ యూనిఫారాలు, ఆయుధాలు, నకిలీ లెటర్‌ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు సహా భారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీడు ఖాకీ కాదు కంత్రీ.. హర్యానాలో కేసు ఉందంటూ తీసుకెళ్లి.. సూర్యాపేటలో..
Fake Police

Edited By:

Updated on: Jun 06, 2026 | 8:08 PM

హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిగా అవతారమెత్తి సొంతంగా సూడో పోలీస్ వ్యవస్థనే నడిపిస్తున్న రౌడీ షీటర్ నాగరాజు రఘు వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నకిలీ ఆర్మీ కల్నల్‌గా చలామణి అయిన అతడు, పీడీ యాక్ట్ కింద పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ తన నేరపూరిత కార్యకలాపాలను కొనసాగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది మే 18న కూకట్‌పల్లికి చెందిన పూర్ణచందర్‌రావును తమను పోలీసులు అని నమ్మబలికి కిడ్నాప్ చేసిన నిందితులు, హర్యానాలో ఉన్న కేసు పేరుతో భయపెట్టి సూర్యాపేటకు తీసుకెళ్లారు. కేసు తీవ్రతను చూపిస్తూ ఏటీఎం, ఫోన్‌పే, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం రూ.5.26 లక్షలు వసూలు చేశారు. అనంతరం బాధితుడి ఫోన్‌లోని సిమ్ కార్డులను తొలగించి, మరో సాధారణ ఫోన్ ఇచ్చి వదిలేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది.

కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో ప్రధాన నిందితుడు నాగరాజు రఘు వర్మతో పాటు మరో ముగ్గురు నిందితులను నిజాంపేటలో అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నాగరాజు 12 వేర్వేరు పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించుకుని చలామణి అయినట్లు, అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హర్యానాకు చెందిన సస్పెండ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్ అలియాస్ ఫౌజీ సహాయంతో పోలీస్ శాఖకు సంబంధించిన అంతర్గత విధానాలు, మెళకువలను తెలుసుకుని నాగరాజు ఈ ముఠాను ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది.

నిందితుల నుంచి కంట్రీమేడ్ పిస్టల్, ఎయిర్ పిస్టల్, ఇతర ఆయుధాలు, పోలీస్ యూనిఫారాలు, హోదాలను సూచించే స్టార్లు, నకిలీ లెటర్‌ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు, బేడీలు, వాహనాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా, రౌడీ షీట్ ఉన్నప్పటికీ నాగరాజు తన తీరు మార్చుకోకుండా సమాంతర పోలీస్ వ్యవస్థను నడిపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us