
హైదరాబాద్‌లో గోషామహల్ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్న సమయంలో పోలీసులను చూసిన ఓ యువకుడు ఒక్కసారిగా స్కూటీ వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని వెంబడించి పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ మెయిన్ జంక్షన్ సమీపంలో గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్కూటీపై వచ్చిన ఓ యువకుడు పోలీసులను చూసి భయంతో స్కూటీని అక్కడే వదిలేసి పరుగులు తీశాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం నెలకొంది.
యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడు పారిపోకుండా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతడిని తనిఖీ చేయగా జేబులో గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు కూడా నివ్వెరపోయిన పరిస్థితి. దీంతో వెంటనే గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని, గంజాయి పొట్లాలతో పాటు అతడిని అఫ్జల్‌గంజ్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి వద్ద గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి తీసుకున్నాడు? వ్యక్తిగత వినియోగానికా లేక ఇతరులకు సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నాడా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తిస్తుంటారు. కానీ ఈ తనిఖీల సమయంలో పోలీసులను చూసి పారిపోయిన యువకుడి జేబులో గంజాయి పొట్లాలు బయటపడటం ఆసక్తికరంగా మారింది. ట్రాఫిక్ తనిఖీల్లో పోలీసుల అప్రమత్తతతో మరో గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.