
వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక చోట ఎండలు మండిపోతుంటే.. ఇంకో చోట వానలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడో నీటి కోసం జనం అల్లాడుతుంటే, మరెక్కడో వరదలు ఊళ్లను ముంచేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి కలవరపెడుతుంది ఎల్‌నినో. పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు నీళ్లు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల మొదలయ్యే ఈ వాతావరణ పరిణామం. ఈసారి మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా వాతావరణ సంస్థ NOAA సెప్టెంబర్ 10న ఇచ్చిన తాజా అంచనా ప్రకారం.. 2026 ఉత్తరార్థంలో, 2026-27 శీతాకాలంలో చాలా బలమైన ఎల్‌నినో ఏర్పడే అవకాశం 90 శాతానికి పైగా ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 1950 తర్వాత నమోదైన ఎల్‌నినోల్లో గత రికార్డులను మించే స్థాయికి వెళ్లే అవకాశం 75 శాతం ఉందని NOAA చెబుతోంది. తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలకుపైగా ఎక్కువగా నమోదవుతున్నాయి. అంటే ఈసారి ఎల్‌నినోను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎల్‌నినో అంటే ఏంటి? పసిఫిక్ సముద్రం వేడెక్కితే దాని సెగ ప్రపంచ వాతావరణానికి తగులుతుంది. గాలుల తీరు మారుతుంది. వానల తీరు మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో వానలు తగ్గొచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు...