భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకులను కేంద్రంగా చేసుకొని నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు కాజేసిన కేటుగాళ్ల బాగోతం ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మణుగూరులో కూడా నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు కాజేశారు కొందరు కేటుగాళ్లు.
మణుగూరులోని ఫిన్‌కేర్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు ఇటీవల బంగారు ఆభరణాలను వేలంపాటకు పెట్టింది. ఈ క్రమంలోనే వేములవాడకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఆన్లైన్ వేలంపాటలో ఆ ఆభరణాలను రూ.12 లక్షల 80 వేలకు దక్కించుకున్నాడు. అందుకు సంబంధించి డబ్బులు కూడా చెల్లించి ఆభరణాలను తీసుకెళ్లిన శివకుమార్ వాటిని కట్ చేయగా అసలు విషయం బయటపడింది. పైన బంగారు పూతతో లోపల వెండితో చేసిన ఆభరణాలుగా గుర్తించిన శివకుమార్ వెంటనే ఆ వాటిని తీసుకొని మణుగూరులోని బ్యాంకు సిబ్బందిని కలిశాడు, ఇదేంటని నిలదీశాడు. ఆభరణాలను చూపించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. వాటితో మాకు తమకు సంబంధం లేదని అది ముందే చూసుకోవాలంటూ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
మణుగూరులోని ఫిన్‌కేర్ బ్యాంకులో 12 లక్షల 80 వేలు పెట్టి బంగారు ఆభరణాలను వేలంపాటలో కొనుగోలు చేస్తే నకిలీ బంగారాన్ని తమకు అంటగట్టి బ్యాంకు అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. జరిగిన ఘటనపై మణుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడ. తమకు నకిలీ బంగారాన్ని అంటగట్టిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
మణుగూరులో పలు బ్యాంకులలో కొందరు బ్యాంకుల సిబ్బంది సహకారంతో నకిలీ బంగారం తాకట్టు పెట్టిన ముఠా గుట్టు ఇటీవల రట్టయింది. బ్యాంకులో సిబ్బంది సహకారంతో పైన బంగారం లోపల వెండితో చేసిన ఆభరణాలను తాకట్టు పెట్టి లక్షల రూపాయల అప్పుగా తీసుకున్నాడు పూజారి శ్రీనివాస్, వంశి అనే ఇద్దరు వ్యక్తులు.. అందులో వంశీ అనే వ్యక్తి తాను ఫిన్‌కేర్ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టానని పోలీసుల విచారణలో తెలిపాడు. అయినా కూడా అదే నకిలీ బంగారాన్ని వేలంపాటలో పెట్టి అమాయకులకు బ్యాంకు సిబ్బంది అంట కట్టారు. మోసం జరిగిందని గుర్తించిన బాధితులు గత 15 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే విషయంపై బాధితులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి