
ప్రకృతి వైపరీత్యమో లేక జన్యుపరమైన లోపమో తెలియదు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కళ్లు, ముక్కు లేకుండా కేవలం నోరు, చెవులతో ఒక మేకపిల్ల జన్మించడం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఆ వింత జీవిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. టేకులపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కురుస సుబ్బయ్య అనే రైతు ఇంట్లో ఈ వింత చోటుచేసుకుంది. ఆయన పెంచుకుంటున్న మేక ఒక పిల్లన జన్మనివ్వగా, అది చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ మేకపిల్లకు ముఖం మీద కళ్లు లేవు, గాలి పీల్చుకోవడానికి ముక్కు కూడా లేదు. కేవలం నోరు, చెవులు మాత్రమే ఉన్నాయి.
సాధారణంగా ఇలాంటి లోపాలతో పుట్టే జీవులు ఎక్కువ కాలం బ్రతకడం కష్టం. కానీ ఈ మేకపిల్ల మాత్రం ఆశ్చర్యకరంగా ఆరోగ్యంగానే ఉంది. ముక్కు లేకపోవడంతో ఆ మేకపిల్ల తన నోటి ద్వారానే గాలి పీల్చుకుంటోంది. ఎంతో చురుగ్గా ఉంటూ తన తల్లి వద్ద పాలు తాగుతుండటం విశేషం. ఈ వింత మేకపిల్ల వార్త దావాగ్నంలా వ్యాపించడంతో కిష్టారం గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా తరలివస్తున్నారు. ఇదేం వింత రా నాయనా అని కొందరు ఆశ్చర్యపోతుంటే, ఇది దైవ లీల అని మరికొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వింత మేకపిల్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.