Telangana: పైనుంచి చూస్తే పనసకాయల లోడే.. లోపల చెక్ చేయగా..

గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. సూర్యాపేట, నల్లగొండ పోలీసుల తోపాటు రాచకొండ పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైవే, ఇతర ప్రధాన రహదారులపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు గంజాయి మత్తులో పడి యువత చిత్తయిపోకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telangana: పైనుంచి చూస్తే పనసకాయల లోడే.. లోపల చెక్ చేయగా..
Jackfruit Load (Representative image)
Follow us

|

Updated on: Jun 30, 2024 | 4:35 PM

అరే ఓ సాంబా..రాస్కో. గంజాయి సరుకు కన్పించానా.. ఆ మాట విన్పించినా..ఇక కథ మాములుగా ఉండదు. చెవులు వలిచి చేతిలో పెట్టడం మాత్రమే అంతకు మించి కఠిన శిక్షలు తప్పవు. ఇదీ ఇటు తెలంగాణ అటు ఏపీలో సర్కార్ వారి మాట. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు గట్టి నిఘా పెట్టారు కూడా. అయినా కొందరు కేటుగాళ్లు పుష్ప సినిమాలో హీరో తరహాలో ఇస్మార్ట్ పద్దతిలో గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించి అడ్డంగా బుక్కవుతున్నారు. శామీర్ పేట్  పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా.. ఓ గంజాయి మఠా గుట్టు రట్టయింది. అయితే పోలీసులకు చిక్కకుండా నిందితులు మస్త్ స్కెచ్ వేశారు. బొలోరో వాహనంలో గంజాయిని పెట్టి.. పైకి పనస పండ్ల లోడ్ అన్నట్లు కలరింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు వాహనం మొత్తం చెక్ చేయగా బండారం బయటపడింది.

గంజాయి తరలిస్తున్న బోలెరో వాహనంతో పాటు.. దానికి పెట్రోలింగ్ వ్యవహరించిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  కోరాడ  సాయి, బండారు శివకుమార్, గేదెల సతీష్‌లను అదుపులోకి తీసుకుని.. 35 కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.  8 లక్షల వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.   శివ అనే మరో నిందితుడు తప్పించుకున్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి ఈ గంజాయి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులను రిమాండుకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు పాత నేరస్థులుగా గుర్తించారు.

ఇటు తెలంగాణ అటు ఏపీలో .. ప్రభుత్వాలు గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాయి.కానీ ఇన్నాళ్లుగా వేళ్లూనుకుపోయిన గంజాయి మాఫియా ఎప్పటికప్పుడు సరికొత్తగా అక్రమ రవాణా మార్గాలనే అన్వేషిస్తూనే ఉంది. పట్టుబడుతున్న సరుకే అందుకు నిదర్శనం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు గంజాయి అక్రమ రవణా సహా మూలాలపై ఫోకస్‌ పెట్టారు. మరి ఇకనైనా గంజాయి పీడ పోతుందేమో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..