Telangana: ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..

తరతరాలుగా ఈ భూములనే నమ్ముకుని తమ కుటుంబాలు బతుకుతున్నాయని, అలాంటి భూములను కాలువ కోసం తీసుకుంటాము అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని అంటున్నారు రైతులు. ఇప్పుడు కొండపోచమ్మ నుండి తీయనున్న సంగారెడ్డి కాలువ కోసం తీసుకుంటామంటే మేం ఎలా బతకాలంటూ మెదక్‌ జిల్లా చిన్నచింతకుంట గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయాక నీళ్లు మాకెందుకు అని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామ శివారులో పంట పొలాల్లో ధర్నా చేపట్టిన రైతులు భూ సేకరణ వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు.

Telangana: ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
Medak District
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 26, 2024 | 4:36 PM

తరతరాలుగా ఈ భూములనే నమ్ముకుని తమ కుటుంబాలు బతుకుతున్నాయని, అలాంటి భూములను కాలువ కోసం తీసుకుంటాము అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని అంటున్నారు రైతులు. ఇప్పుడు కొండపోచమ్మ నుండి తీయనున్న సంగారెడ్డి కాలువ కోసం తీసుకుంటామంటే మేం ఎలా బతకాలంటూ మెదక్‌ జిల్లా చిన్నచింతకుంట గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయాక నీళ్లు మాకెందుకు అని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామ శివారులో పంట పొలాల్లో ధర్నా చేపట్టిన రైతులు భూ సేకరణ వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. కొండపోచమ్మ సాగర్ నుండి సంగారెడ్డి కెనాల్‌ కోసం రైతుల నుంచి భూసేకరణకు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో గత మూడు రోజులుగా గ్రామాలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మండలంలోని చిన్న చింతకుంట గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు సంగారెడ్డి కెనాల్‌ త్వరలో చేపట్టనున్న రీజినల్‌ రింగురోడ్డు లోపల ఏర్పాటు కానున్నదని తెలిపారు. దీంతో ఈ ప్రాంతం పట్టణీకరణ దిశగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడంతో తమ గ్రామాల గుండా కాలువ వద్దంటూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఆర్డీవో స్పందిస్తూ తన చేతిలో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, కేవలం మీ అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. వినతిపత్రం ఇచ్చి బయటకు వచ్చిన చిన్నచింతకుంట రైతులు మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ కుటుంబాలు ఈ భూములపైనే ఆధారపడి బతుకుతున్నామని తెలిపారు. తమ భూములు తీసుకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా పరిహారం విషయమై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా భూములు తీసుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రూ.50 లక్షలకు పైగా ఎకరా పలుకుతున్న భూములకు అరకొర పరిహారం ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.

కాలువలకు బదులు పైపుల ద్వారా నీటిని తరలించాలన్నారు. రైతుల ఆవేదనను చూసిన ఆర్టీవో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా నేడు నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామ శివారులోని పంట పొలాల వద్ద ధర్నా చేపట్టారు రైతులు. భూసేకరణ వెంటనే నిలిపివేయాలంటూ, కొండపోచమ్మ సాగర్ వద్దంటూ భూములు కోల్పోయాక సాగర్ ద్వారా వచ్చే నీళ్లు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకునే తమ దగ్గర భూములు లాక్కోవద్దు అంటూ పంట పొలాల వద్ద ధర్నా చేపట్టారు. గత వారం రోజుల క్రితం నర్సాపూర్ రైతు వేదిక పక్కన గల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టిన రైతులు.. నేడు పంట పొలాల వద్ద ధర్నా చేపట్టారు. తమ పొలాల వద్దకు భూసేకరణకు అధికారులు రావద్దని ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు వదులుకోమంటున్నారు. గతంలో ప్రగతి భవన్ వరకు రెండుసార్లు పాదయాత్ర చేపట్టిన రైతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సైతం వినతి పత్రం అందించామని తెలిపారు.

అయినా సమస్య పరిష్కారం కాలేదని, భూములు కోల్పోయి రోడ్డును పడితే తమను ఆదుకునేది ఎవరని నిలదీశారు. భూములు కోల్పోతున్నామని తెలిసి తమ కుమారుల పెళ్లికి అమ్మాయిని సైతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకుగాను సంగారెడ్డి కెనాల్ రీచ్ 2 పనులు తక్షణమే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు రైతులు. నర్సాపూర్ మండలంలోని చిప్పలుదుర్తి, పెద్ద చింతకుంట, చిన్న చింతకుంట, లింగాపూర్ గొల్లపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలు, శివంపేట మండలం పిలుట్ల, లింగోజిగూడ, తిమ్మాపూర్, పెద్ద గొట్టి ముక్కల చిన్నగొట్టి ముక్కుల, గోమారం, సికిండ్లపూర్, పరికిబండా, గౌతజి గూడ, మనోహరాబాద్, జీడిపల్లి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దౌల్తాబాద్, దేవులపల్లి గ్రామాలకు సంబంధించిన రైతుల భూములను కొండపోచమ్మ సాగర్ నిర్మాణానికై అధికారులు సేకరణ చేపడుతున్నారు. వీరందరూ భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేమని అంటున్నారు. వలసలకు వెళ్లి బతికేంత శక్తి లేదని తమ వద్ద దయచేసి భూములు లాక్కోవద్దని వ్యవసాయం తప్ప తమకు ఏమి తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…