
హైదరాబాద్: క్లెయిమ్ (వైరల్ ప్రచారం)..! హైదరాబాద్ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని, అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారని సోషల్ మీడియాలో ఒక ప్రకటన వైరల్ అయింది.
హైదరాబాద్ పోలీస్ శాఖ పేరుతో ఒక నకిలీ నియామక ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారులు స్పందిస్తూ ఆ ప్రకటనలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ధృవీకరించకుండా ఇలాంటి పోస్టులను నమ్మవద్దని, ఇతరులతో పంచుకోవద్దని ప్రజలకు సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు సంబంధించిన నియామక ప్రకటనలు అధికారిక మార్గాల ద్వారానే విడుదల అవుతాయని తెలిపారు. అధికారిక నోటిఫికేషన్లను మాత్రమే విశ్వసించాలని సూచించారు.
అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసే ముందు దాని ప్రామాణికతను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత నకిలీ ఉద్యోగ ప్రకటనలు, సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
“హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో గోల్డెన్ జాబ్ అవకాశాలు” అంటూ ప్రచారం చేస్తున్న పోస్టులకు ఎలాంటి ఆధారం లేదు. హైదరాబాద్ పోలీస్ శాఖ అలాంటి నియామక ప్రక్రియను ప్రకటించలేదు. కాబట్టి వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన నకిలీది.