Hyderabad: వేసవిలో తాగు నీటి కష్టాలకు చెక్‌.. జలమండలి మాస్టర్ ప్లాన్ ఇదే!

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే వేసవిలో హైదరాబాద్ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు నీటి సరఫరాను అందించే సింగూరు-మంజీరా జలవనరులు తగ్గుతున్న నేపథ్యంలో, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వంటి ప్రత్యామ్నాయ జలవనరుల నుండి అదనపు నీటిని తరలించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. నగర ప్రజలకు నిరంతరాయ తాగునీటి సరఫరా లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది.

Hyderabad: వేసవిలో తాగు నీటి కష్టాలకు చెక్‌.. జలమండలి మాస్టర్ ప్లాన్ ఇదే!
Hyderabad Water Supply

Updated on: Nov 11, 2026 | 7:25 PM

ఎల్‌నినో ప్రభావం.. రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాలో తలెత్తే అవకాశం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా నగరానికి ప్రధాన జలవనరులైన సింగూరు-మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి బుధవారం ఉన్నతాధికారుల బృందంతో కలిసి గండిపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల నుంచి నగరానికి అదనపు తాగునీటిని సరఫరా చేసే సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా రాబోయే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెరిగే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, జంట జలాశయాల నుంచి అదనంగా ఎంత నీటిని సేకరించవచ్చు, ఏ మార్గాల్లో తరలించవచ్చు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్‌లైన్ వ్యవస్థతో ఎలా అనుసంధానం చేయవచ్చనే అంశాలపై అధికారులతో చర్చించారు.

అదనపు నీటి తరలింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాలు, భవిష్యత్ విస్తరణ అవకాశాలను పరిశీలించారు. నీటి లభ్యత, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని సమగ్రంగా అంచనా వేసిన అనంతరం తదుపరి కార్యాచరణను రూపొందించనున్నారు.

రాబోయే వేసవిలో తాగునీటి డిమాండ్ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి జలవనరును సమర్థంగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ఎండీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా సింగూరు- మంజీరా జలవనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అన్ని అవకాశాలను పరిశీలిస్తూ, ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నట్లు జలమండలి వెల్లడించింది.ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మహేష్ కుమార్, సీఈఓ రాంబాబుతో పాటు ప్రాజెక్టు, ట్రాన్స్‌మిషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us