మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. పొరపాటున పోలీసులకు పట్టుబడితే మీ లైసెన్స్ రద్దు అయినట్టే.. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రమాదాలు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయని గుర్తించిన రవాణా శాఖ అధికారులు.. వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇంతకు ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే చలానా వేసి వదిలేసే వారు. కానీ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు.
నాలుగున్నర ఏళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 48 వేల లైసెన్సులను రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. వీటిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులతో పాటు, ప్రమాదాలలో మరణాలకు కారణమైన వారి లైసెన్సులను కూడా రద్దు చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే వారి విషయంలో రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది.
వారి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తోంది. నాలుగున్నరేళ్లలో 48 వేలకు పైగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సు లను రద్దు చేసింది. వీరిలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారే ఎక్కువగా ఉన్నారు.
గత నాలుగు సంవత్సరాల్లో నాలుగు నుంచి ఆరు రెట్లు అధికంగా డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2022-23లో అత్యధికంగా 18 వేలకు పైగా, 2023-24లో 12 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెన్షన్‌లో పెట్టినట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నవంబరు 30 వరకు 5 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోనే అత్యధిక డ్రైవింగ్ లైసెన్స్ ల సస్పెన్షన్ ఉంటోంది. తరువాతి స్థానం మేడ్చల్ మల్కాజిగిరి కాగా.. మూడో స్థానం రంగారెడ్డి జిల్లా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్ కారణంగా సస్పెండ్ చేస్తున్న లైసెన్సుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనివే ఉంటాయని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి