Hyderabad: అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..

పెళ్లై పదేళ్లు గడుస్తున్నా.. సంతానం లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల సునీతా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఎంతకూ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దల కొట్టగా ఈ విషాదం వెలుగు చూసింది.

Hyderabad: అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..
Madhapur Tragic Incident (1)

Edited By:

Updated on: Aug 28, 2026 | 10:24 AM

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామానికి చెందిన ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల సునీతా నాయక్ అలియాస్ సోనీ అనే వివాహిత తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సునీతకు పదేళ్ల క్రితం ధర్మేంద్ర కుమార్‌తో వివాహం జరగ్గా, ఆమె ఆయనకు రెండో భార్య. సుమారు ఆరేళ్లుగా ఈ దంపతులు ఇజ్జత్‌నగర్‌లో నివసిస్తున్నారు. వివాహమై పదేళ్లు కావస్తున్నా సంతానం కలగకపోవడంతో సునీత గత కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

ధర్మేంద్ర కుమార్ మాదాపూర్‌లోని కేఆర్‌బీ మైండ్ స్పేస్ లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఆయన నైట్ డ్యూటీ కోసం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. మరుసటి రోజు అంటే ఆగస్టు 27న మధ్యాహ్నం 12:32 గంటల ప్రాంతంలో ఇంటి యజమాని భారతి.. సునీత తలుపులు తీయడం లేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని ధర్మేంద్రకు సమాచారం అందించారు. దీంతో ఆందోళనకు గురైన ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో యజమాని, మరికొందరి సాయంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూశారు.

అప్పటికే బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని సునీత అచేతనంగా పడివుంది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. దంపతులకు పిల్లలు లేకపోవడమే ఈ దారుణానికి ప్రధాన కారణమా లేక మరేవైనా కుటుంబ కలహాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us