Telangana: రుణమాఫీకి మరో డెడ్‌లైన్‌.. కాంగ్రెస్‌‌లో డిసెంబర్‌ 9 సెంటిమెంట్..! ఆ నేతల నోట అదే మాట..

|

Oct 13, 2024 | 11:21 AM

రైతే రాజు.. రైతు రుణం మా బాధ్యత.. రైతుల పంట బీమా మా ప్రామిస్.. అంటూ రైతు పాట రిపీటెడ్‌గా పాడుతోంది కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ సబ్జెక్ట్‌లో ఆశించినన్ని మార్కులు పడలేదన్న అభిప్రాయాల్ని తుడిచిపెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. అందుకే.. రుణమాఫీపై అసంతృప్తిగా ఉన్న రైతులకు డిసెంబర్‌9ని డెడ్‌లైన్‌గా విధించిందా..? రేవంత్ టీమ్ పదేపదే చెబుతున్న మాఫీ మాటల్లో అంతరార్థం అదేనా..?

Telangana: రుణమాఫీకి మరో డెడ్‌లైన్‌.. కాంగ్రెస్‌‌లో డిసెంబర్‌ 9 సెంటిమెంట్..! ఆ నేతల నోట అదే మాట..
Runa Mafi Telangana
Follow us on

డిసెంబర్‌ 9.. కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చే సెంటిమెంట్. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకైతే ఈ డేట్‌తో ఎటాచ్‌మెంట్ మరీ ఎక్కువ. మేడమ్ సోనియాగాంధీ పుట్టినరోజు. పైగా.. రేవంత్ రెడ్డి సర్కారు కొలువు దీరిన రోజు. ప్రభుత్వంలోకొచ్చాక మరోసారి డిసెంబర్‌9 సెంటిమెంట్‌ను సాలిడ్‌గా టేస్ట్ చెయ్యబోతోంది కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ అరకొరగా జరిగిందన్న ఆరోపణల్ని గట్టిగా తిప్పికొట్టాలని భావించి.. దానికి డిసెంబర్‌9నే ముహూర్తంగా పెట్టుకుంది రేవంత్‌ సర్కార్. రైతు ఓటుబ్యాంకు చేజారకుండా జాగ్రత్తపడుతోంది.

రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, డిసెంబర్‌ 9 లోగా మిగతా వారందరికీ మాఫీని వర్తింపజేస్తామని పదేపదే చెబుతూ వస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పవర్‌ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రులు.. సందర్భం కాకపోయినా.. రైతుపాటనే గట్టిగా పాడారు. వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో 73 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణాయేనని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు రుణమాఫీ అమలు చేసిన ఘనత తమదేనన్నారు. 18 వేల కోట్లు 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేసింది మేమే అని గర్వంగా చెప్పుకున్నారు. ఇక్కడితోనే ఆగలేదు. రుణమాఫీలో సాంకేతిక లోపాల్ని సరిచేసి.. త్వరలో లబ్దిదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మాటిచ్చారు భట్టి.

అదే వేదికపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా.. ఇదే మాటకు కోరస్ ఇచ్చారు. మేం రైతు పక్షపాతులం.. అంటూ అన్నదాతల్ని ప్రసన్నం చేసుకోబోయారు. అటు.. సిఎం రేవంత్ రెడ్డిని విప్లవనాయకుడితో పోల్చి మరో అడుగు ముందుకేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం రేవంత్‌రెడ్డి ఇందిరాగాంధీలా కృషి చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా రేవంత్‌రెడ్డికి ఉందని చెప్పారు మల్లు.

ఏదైతేనేం.. ఈసారి డిసెంబర్‌9ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనే పట్టుదలతో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ ఒక్కటే కాదు.. భవిష్యత్తులో రైతుల పంట బీమా కూడా ప్రభుత్వమే కడుతుందని మాటిస్తున్నారు మంత్రులు. ఈ విధంగా.. యావత్ తెలంగాణ రైతాంగం తమవైపే.. అని శత్రుపార్టీలకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేస్తోంది రేవంత్ సర్కార్..

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..