Rahul Gandhi Public Meeting Highlights : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 4 వేల పెన్షన్ : రాహుల్ గాంధీ

|

Jul 02, 2023 | 8:27 PM

Rahul Gandhi Public Meet in Khammam Highlights: ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభ ముగిసింది . ఈ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు.

Rahul Gandhi Public Meeting Highlights : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 4 వేల పెన్షన్ : రాహుల్ గాంధీ
Rahul Gandhi Public Meeting

Rahul Gandhi Public Meet in Khammam Highlights: ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరుగుతోంది. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు ఠాక్రే హజరుకానున్నారు. ఖమ్మం నగరంలోని SR గార్డెన్స్ వెనక ప్రాంతంలో ఉన్న ఖాళీ ప్రాంగణంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారు. ఇదే వేదికగా పాదయాత్ర ముగింపు సందర్భంగా భట్టి విక్రమార్కకు ఘనంగా సన్మానించనున్నారు. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్‌ సభ నేపథ్యంలో ఖమ్మం మొత్తం కాంగ్రెస్‌ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు, కటౌట్లతో కళకళలాడుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ సభకు తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మంకు వస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభకు స్వచ్చంధంగా తరలివస్తున్న ప్రజల్ని, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటే.. తామే రోడ్లపైకి వస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సభా ప్రాంగణానికి నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Jul 2023 07:22 PM (IST)

    రేవంత్‌ రెడ్డి స్పీచ్‌..

    • తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిని కాంగ్రెస్‌ బాధ్యత తీసుకుంటుంది.
    • పొంగులేటి చేరికతో ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తాం.
    • భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
    • తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.
    • రాహుల్‌ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
  • 02 Jul 2023 07:10 PM (IST)

    సీఎం కేసీఆర్‌ అవినీతికి ప్రధాని మోడీ అండదండలు

    • సీఎం కేసీఆర్‌ అవినీతికి ప్రధాని మోడీ అండదండలున్నాయి.
    • బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ బంధువుల పార్టీ
    • తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను కచ్చితంగా ఓడుస్తాం.
    • కార్యకర్తలే కాంగ్రెస్‌కు వెన్నెముక. మీరు బీఆర్ఎస్‌ను సులభంగా ఓడించగలరు

  • 02 Jul 2023 07:07 PM (IST)

    మోడీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌

    • మోడీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ ఉంది. బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తోంది.
    • తెలంగాణలో బీజేపీ అడ్రస్‌ లేకుండా పోయింది.
    • తెలంగాణలోనూ కర్ణాటక తరహా ఫలితాలు వస్తాయి.
  • 02 Jul 2023 07:04 PM (IST)

    అధికారంలో వచ్చాక రూ. 4వేల పెన్షన్

    • కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌
    • సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకుంటాం
    • గిరిజనులకు పోడు భూములు ఇస్తాం
  • 02 Jul 2023 07:00 PM (IST)

    బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ రిస్తేదార్‌ పార్టీ

    • బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ రిస్తేదార్‌ పార్టీ
    • తెలంగాణ ముఖ్యమంత్రి తన జాగీరు అనుకుంటున్నారు.
    • కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు రూపాయల అవినీతి జరిగింది.
    • ధరణి పోర్టల్‌ సమస్యలను యాత్రలో తెలుసుకున్నాను.
    • కేసీఆర్‌ హయాంలో రైతులు, ఆదివాసీలు, యువత, దళితులు అందరూ నష్టపోయారు
  • 02 Jul 2023 06:56 PM (IST)

    ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట: రాహుల్

    • కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పొంగులేటిని అభినందిస్తున్నాను.
    • పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్కకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా
    • ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ కంచుకోట, ప్రతిసారి మమ్మల్ని ఆదరించింది.
    • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పులిలా పోరాడుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలకు ధన్యవాదాలు
  • 02 Jul 2023 06:52 PM (IST)

    రాహుల్‌ గాంధీ స్పీచ్‌..

    • భారత్ జోడో యాత్ర తెలంగాణకు రావడం ఎంతో సంతోషకరంగా ఉంది.
    • నా యాత్రను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
    • యాత్రలో దేశాన్ని కలిపే విషయమే అందరితో మాట్లాడాను. మన ఐడీయాలజీ కేవలం దేశాన్ని కలపడం మాత్రమే.
    • దేశమంతా భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలిచింది.
    • యాత్ర ద్వారా దేశంలో ద్వేషాన్ని, విద్వేషాన్ని దూరం చేసే ప్రయత్నం చేశాం
  • 02 Jul 2023 06:44 PM (IST)

    యువత సోడాలమ్ముకుంటున్నారు: భట్టి విక్రమార్క

    • పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకున్నాను.
    • తెలంగాణలో యువతకు ఉద్యోగాల్లేవు. యువత కొందరు సోడాలమ్ముకుంటున్నారు. మరికొందరు పెళ్లిళ్లలో సప్లయర్స్‌గా మారిపోయారు.
    • ధరణి పేరుతో ప్రజల భూములను లాక్కుంటోంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.
  • 02 Jul 2023 06:40 PM (IST)

    కొండలు, వాగులు, బొగ్గు గనుల్లో తిరిగా: భట్టి విక్రమార్క

    • రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు పొడిగింపే పీపుల్స్‌ మార్చ్‌
    • రాహుల్‌ సందేశాన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేశాను
    • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం
    • ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావడం లేదు
  • 02 Jul 2023 06:29 PM (IST)

    కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది: పొంగులేటి

    • యావత్‌ దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి గ్రాఫ్‌ బాగా పెరిగింది.
    • రాహుల్‌ భారత్ జోడో యాత్రకు తెలంగాణలో మంచి స్పందన దక్కింది.
    • కేసీఆర్‌ను ఇంటికి పంపించడమే కాంగ్రెస్‌ ఏకైక లక్ష్యం.
  • 02 Jul 2023 06:26 PM (IST)

    బీఆర్‌ఎస్‌ను బంగాళా ఖాతంలో కలుపుతాం

    • తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌. సోనియా కారణంగానే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది.
    • 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుంది. అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తాం.
    • బీఆర్ఎస్‌ పార్టీని బంగాళా ఖాతంలో కలపాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం
  • 02 Jul 2023 06:22 PM (IST)

    కేసీఆర్‌ హయాంలో 8వేల మంది రైతుల ఆత్మహత్య

    ఖమ్మం జనగర్జన సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఈసందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం గుప్పించారు. కేసీఆర్‌ మాయమాటలు, మోసపూరిత హామీలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో ఏకంగా 8వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.

  • 02 Jul 2023 06:15 PM (IST)

    కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పీ మాజీ ఎంపీని  పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మువ్వ విజయ్ బాబు, పలువురు ప్రముఖులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

  • 02 Jul 2023 06:00 PM (IST)

    గద్దర్, రాహుల్ ఆలింగనం

    ఇటీవలే కొత్త పార్టీ పెట్టిన గద్దర్ ఖమ్మం జనగర్జన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ వేదికపై రాహుల్ గాంధీకి ఆప్యాయంగా ముద్దు పెట్టి ఆలింగనం చేసుకున్నారు.

  • 02 Jul 2023 05:49 PM (IST)

    ఖమ్మం చేరుకున్న రాహుల్..

    కాంగ్రెస్‌ జనగర్జన సభకు హాజరయ్యేందుకు రాహుల్‌ గాంధీ ఖమ్మం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన రాహుల్‌ గాంధీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ఏపీకి చెందిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనగర్జన సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు. ఇదే వేదికగా సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపు కూడా ఉంటుంది.

  • 02 Jul 2023 05:13 PM (IST)

    గన్నవరం ఎయిర్ పోర్టుకు రాహుల్.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు..

    గన్నవరం ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది.  పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. హెలికాప్టర్ లో రాహుల్ ఖమ్మం చేరుకోనున్నారు.

  • 02 Jul 2023 04:48 PM (IST)

    ఖమ్మం సభకు ముందు రేవంత్ రెడ్డి ట్వీట్

    ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభ ప్రారంభానికి ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘ నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు.

  • 02 Jul 2023 04:34 PM (IST)

    ఖమ్మంలో భారీగా ట్రాఫిక్ జామ్..

    ఖమ్మంలో జరుగుతున్న కాంగ్రెస్ సభకు వేలాది మంది తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో శ్రీశ్రీసర్కిల్‌ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  కలెక్టరేట్‌ వరకు కి.మీ.మేర  వాహనాలు నిలిచిపోయాయి.  దీంతో వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • 02 Jul 2023 04:15 PM (IST)

    టీ కాంగ్రెస్ లో కొత్త జోష్..

    తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో గత కొన్నేళ్లుగా కనిపించని జోష్‌ ఇవాళ కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్‌ వేరు..ఇవాళ ఉన్న కాంగ్రెస్‌ వేరు అన్నట్లుగా సీన్‌ క్రియేట్‌ అయ్యింది. అటు రాహుల్‌ రాక.. ఇటు పొంగులేటి చేరిక..మధ్యలో భట్టి పాదయాత్ర ముగింపు వేడుక..అన్నీ ఒకే వేదికపై చూస్తుంటే..నేతలకు నోట మాట రావడం లేదు..వాళ్ల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తున్నంత ధీమా వాళ్ల కళ్లల్లో కనిపిస్తోంది.. ఇంత భారీ సభ ఖమ్మం గడ్డపై జరగడం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నచాలా మంది లీడర్లు ఖమ్మం వెళ్లడం పార్టీకి టన్నుల టన్నుల బూస్ట్‌ ఇచ్చినట్లయ్యింది.. ఇదే జోష్ కంటిన్యూ కావాలని నేతలు కోరుకుంటున్నారు..
    ఖమ్మం వైపు వెళ్లే ఏ రోడ్డు చూసినా.. ఏ టోల్గేట్‌ దగ్గర చూసినా.. కాంగ్రెస్‌ లీడర్లు, కార్యకర్తలే కనిపిస్తున్నారు.

  • 02 Jul 2023 04:14 PM (IST)

    రాహుల్ సభకు భద్రత కల్పిస్తున్నాం..

    మరోవైపు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు.. తాము ఎలాంటి ఆంక్షలు పెట్టలేదంటున్నారు పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్.. బహిరంగ సభకు వచ్చేవాళ్లను అడ్డుకోవడం కానీ.. ఎక్కడైనా ఆంక్షలు పెట్టడం కానీ చేయలేదంటున్నారు..భారీ జన సమీకరణ జరిగే చోట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు మాత్రమే చేశామని కమిషనర్‌ క్లారిటీ ఇచ్చారు..

  • 02 Jul 2023 03:33 PM (IST)

    రాహుల్ సభకు ఆటంకాలు కల్పించలేదు: సీపీ విష్ణు వారియర్

    రాహుల్ గాంధీ సభకు పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ స్పందించారు.   రాహుల్ గాంధీ సభకు  పూర్తి భద్రత కల్పిస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారాలను  నమ్మవద్దని  ఆయన  కాంగ్రెస్  నేతలకు  సూచించారు.

  • 02 Jul 2023 03:06 PM (IST)

    5.20 కి ఖమ్మం రానున్న రాహుల్ గాంధీ..

    గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం రానున్నారు రాహుల్. 5.20 కి ఖమ్మం చేరుకోనున్నారు.  సుమారు గంటన్నర పాటు సభా వేదికపై రాహుల్ ఉండనున్నారు.  సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా గన్నవరం చేరుకోనున్నారు రాహుల్.  రాహుల్ గాంధీ తో పాటు  రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,రేణుకా చౌదరి  తదితరులు సభ లో ప్రసంగించనున్నారు.

Follow us on