హైడ్రా విషయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి కొన్ని సూచనలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలను హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేయవద్దని చెప్పారు. తన నియోజకవర్గంలో ఏలాంటి కూల్చివేతలు లేకుండా చూడలన్నారు. ఎందుకంటే సంగారెడ్డి నియోజకవర్గం ఔటర్ రింగ్ రోడ్డుకు బయట ఉంటుందని,అందుకే తన నియోజకవర్గంలో కూల్చివేతలు ఉండకూడదన్నారు. ఒకవేళ తన నియోజకవర్గంలో ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. హైడ్రా అధికారులు అత్యుత్సాహం చూపించవద్దన్నారు.
ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతానని జగ్గారెడ్డి చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలను భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేయవద్ద అని ఆయన అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రమే చర్యలు చేపడుతుందని ప్రకటించారని గుర్తు చేశారు. రింగ్ రోడ్డు బయట హైడ్రా యాక్షన్ ఉండదని సీఎం చెప్పినట్లు తెలిపారు. కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు ఉంటాయని ప్రచారం జరుగుతోందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అని ఆయన సూచించారు.
జగ్గారెడ్డి ఏమన్నారంటే..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే టీపీసీసీ ఛీప్‌గా మహేష్ కూమార్ గౌడ్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ కీలక పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు త్వరలో టీపీపీసీ క్యాంపెన్ కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.