రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో రంగురాళ్లు లభ్యమయ్యాయి. ఓ వ్యక్తికి చిట్యాల గుట్ట ప్రాంతంలో మూడు రంగురాళ్లు కనిపించగా, ఒక్కోటి కిలో, అర కిలోలకు పైగానే ఉండడంతో ఇంటికి తెచ్చుకున్నాడు. రంగురాళ్లు అచ్చు వజ్రాలా మాదిరిగానే ఉండడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీర్నపల్లికి చెందిన పిట్ల రాజేశం గ్రామంలో ఓ హోటల్ నడుపుకుంటూ జీవిస్తాడు. ఈ క్రమంలో శుక్రవారం వీర్నపల్లి-మద్దిమల్ల శివారులో చిట్యాల గుట్ట ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మెరుస్తూ మూడు రంగురాళ్లు కనిపించడంతో వాటి చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒకటి కిలో, మిగతా రెండు అరకిలో ఉండడంతో వాటిని వెంటనే తన హోటల్‌కు తీసుకువచ్చాడు. రంగురాళ్లు అచ్చం వజ్రం లాగా మెరుస్తున్నాయంటూ హోటల్‌కు వచ్చేవారు సెల్ఫీ ఫొటోలు దిగి సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టడంతో ఆ రంగురాళ్లు కాస్త వైరల్ అయ్యాయి. ఇలాంటి రంగు రాళ్లు చూడటం అరుదని స్థానికులు చెబుతున్నారు.