శిథిలావస్థలో ఆ ప్రాజెక్టు.. పక్క రాష్ట్రానికి తరలిపోతున్న సాగునీరు..

| Edited By: Srikar T

Aug 12, 2024 | 5:58 PM

అక్కడ సాగునీటి వసతే లేదు. భూగర్భ జలాలూ అంతంత మాత్రమే. కానీ, ఆ ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ ఉంది. అందులోకి వచ్చిన నీటిని ఒడిసిపట్టుకోలేక పోతున్నారు. మన రాష్ట్రం వదిలేసిన నీటితో కర్నాటక రాష్ట్రం ఏకంగా ఒక ప్రాజెక్టునే నిర్మించింది.. ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడుంది..? ఎందుకా పరిస్థితి ఏర్పాడింది.

శిథిలావస్థలో ఆ ప్రాజెక్టు.. పక్క రాష్ట్రానికి తరలిపోతున్న సాగునీరు..
Telangana
Follow us on

అక్కడ సాగునీటి వసతే లేదు. భూగర్భ జలాలూ అంతంత మాత్రమే. కానీ, ఆ ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ ఉంది. అందులోకి వచ్చిన నీటిని ఒడిసిపట్టుకోలేక పోతున్నారు. మన రాష్ట్రం వదిలేసిన నీటితో కర్నాటక రాష్ట్రం ఏకంగా ఒక ప్రాజెక్టునే నిర్మించింది.. ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడుంది..? ఎందుకా పరిస్థితి ఏర్పాడింది. అర్థ శతాబ్ధం చరిత్ర గల ఆ ప్రాజెక్టు ఎందుకు ఇలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం.

ఆ ప్రాంతంలో ఎండాకాలం వచ్చిదంటే పంటలకు సాగు నీరుండదు. వర్షం పడితేనే పంట పండేది. భూగర్భ జలాలు కూడా అతంత మాత్రమే. బంగారంలాంటి భూములున్నా..సాగునీరు లేక ఇబ్బందులు పడాల్సిందే. ఇలాంటి పరిస్థితిలో జహీరాబాద్ ప్రాంత రైతులకు ఓ ఒయాసిస్సులా ఉంది నారింజ ప్రాజెక్టు. ప్రతి ఏటా రెండు నుండి నాలుగు టిఎంసిల నీరు ఈ వాగులో ప్రవహిస్తుంది. కానీ, ఇందులో ఒక్క చుక్క కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడుదు. దీనికి కారణం పూడిక తీయకపోవడం. దీని బాగుకోసం ప్రభుత్వలకు ఎన్నిసార్లు ఈ ప్రాంత రైతులు మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం. నారింజ ప్రాజెక్ట్‎లో ఉండాల్సిన నాలుగు టిఎంసిల నీరు ఏమవుతుందని ప్రశ్నిస్తే.. అధికారుల నుండి సమాధానం ఉండదు. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నారింజవాగు కోహీర్లో పుడుతుంది. కోహీర్, ఝరాసంగం, జహీరాబాద్ మండలాల మీదుగా ప్రవహించి కర్నాటకలోకి వెళ్లుతుంది. అక్కడి నుండి మంజీరా నదిలో కలిస్తుంది.

దీనిపై జహీరాబాద్ మండలం కొత్తూరు.బి వద్ద నారింజ డ్యాం నిర్మించారు. 2 నుంచి 3 టిఎంసిల సామర్థ్యంలో దీనిని నిర్మించగా 6 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలన్నది దీని లక్ష్యం. 1970 డిసెంబర్ 20న దీని నిర్మాణం పూర్తైంది. ఆ తరువాత దీనిని ఎవరూ పట్టించుకోలేదు. 2.3 టిఎంసిల సామర్థ్యమున్న ప్రాజెక్టు కాస్తా.. అర టిఎంసికి చేరింది. పూడిక భారీగా చేరడంతో నీటి నిలువ సామర్థ్యం భారీగా పడిపోయింది. ఉన్న నీరైనా అలాగే ఉంటుందా అంటే అదీ లేదు. డ్యాం గేట్ల మెయింటనెన్స్ సరిగా లేకపోవడంతో వచ్చిన నీరంతా కర్ణాటకకు వెళ్లిపోతుంది. ప్రతి ఏటా రెండు టిఎంసిల నుండి నాలుగు టిఎంసిల నీరు పక్క రాష్ట్రంమైన కర్ణాటకకు వెళ్లిపోతోంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు నారింజ ప్రాజెక్టు నీటిని పట్టించుకోలేదు కానీ, కర్ణాటక రాష్ట్రం మాత్రం ఈ నీటిని ఒడిసి పట్టుకుంది.

దీంతో ఏకంగా కర్ణాటకలో కారింజ పేరున 9 టిఎంసిల ప్రాజెక్టును నిర్మించింది. దీని ద్వారా ఆ ప్రాంతంలో భారీగా సాగు, తాగునీటికి వాడుకుంటోంది. ఫలితంగా నారింజ నుండి తిరిగి మంజీరాలోకి నీరు చేరడం లేదు. దీన్ని గమనించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నారింజ ప్రాజెక్ట్ రిపేరు చేయడనికి కొంత నిధులను విడుదల చేసింది. కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఎవ్వరు కూడా సరిగ్గా పనిచేయలేదు. దీని కారణంగా నారింజ ప్రాజెక్టులోని నీరు మొత్తం ఎల్లప్పుడు పక్క రాష్ట్రం అయిన కర్ణాటకకు వృథాగా పోతున్నాయి. ఈ నారింజ ప్రాజెక్టు కింద 6 వేల ఎకరాలు సాగుకావాల్సిఉంది. 50 సంవత్సరాలు గడుస్తున్నా కాలువల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. నిజంగా చెప్పాలంటే నిర్మాణం కూడా ప్రారంభము కాలేదు. ఫలితంగా ఒక ఎకరా కూడా సాగులోకి రాలేదు. నీరు నిలువ ఉంటే కనీసం భూ గర్భ జలాలు అయినా పెరిగేవి.. గేట్లు సరిగా లేకపోవడంతో నీరంతా వృధాగా వెళ్లిపోతుందని అంటున్నారు స్థానికులు.

దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డు పడినట్లు.. గేట్ల మరమ్మతుల కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఎదో మొక్కుబడిగా పనులు ప్రారంభించారు అధికారులు. కానీ, ఆ పనులు మధ్యలో వదిలివేశారు. ఈ మధ్య కాలంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ నారింజ ప్రాజెక్టులోకి నీరు కూడా భారీగా వచ్చి చేరింది. కానీ గేట్ల మరమ్మతులు చేయకపోవడంతో, పక్క రాష్ట్రానికి మళ్ళీ 2 టిఎంసిల నీరు తరలిపోవడం ఖాయం అంటున్నారు స్థానికులు. జహీరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి ఏర్పాటు చేసిన హైవేను ఆనుకొని ఉన్న ఈ ప్రాజెక్టు 7 గేట్లు ప్రమాదం అంచున ఉన్నాయి. ఈ గేట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడమే కాకుండా ప్రాజెక్టుపై నిర్మించిన బ్రిడ్జి (రోడ్డు) కూలిపోయే పరిస్థితిలో ఉంది. అదే జరిగితే హైవే రోడ్డు పూర్తిగా తెగిపోయి పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రాజెక్టులో నీటి నిల్వ బాగానే ఉంది. అయితే ఇప్పుడున్న కట్టకు రిపేర్లు చేయకుంటే అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అలాగే జహీరాబాద్ మున్సిపాలిటీ, రేజింతల్, మల్కాపూర్, దిండి, కొత్తూరు, మిర్జాపూర్ పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీ నీరంతా ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పశువులు కూడా ఈ నీటిని తాగలేకపోతున్నాయి. మరి కొంతకాలం ఇలాగే వదిలేస్తే హైదరాబాద్ మూసి నదిని తలపించనుంది ఈ నారింజ ప్రాజెక్టు. అలాగే నారింజ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టి కట్ట ఎత్తును పెంచాల్సి ఉంది. మూడేళ్ల క్రితం కొంతమేర పూడికతీత పనులు చేపట్టినా.. ప్రస్తుతం ప్రాజెక్టు ఎత్తు మీటరు కంటే ఎక్కువ ఉండదు. దీనికి తోడు జహీరాబాద్ పరిసర గ్రామాల నుంచి వచ్చే మురుగునీరు మొత్తం ఈ ప్రాజెక్టులో చేరుతుంది. ఇంకొన్ని రోజులు ఇలాగే వదిలేస్తే ప్రాజెక్టు మొత్తం మురుగు నీటితో నిండిపోతుందని అంటున్నారు స్థానికులు. అప్పుడు ఎంత నీరు ఉన్నా రైతులకు ఉపయోగకరంగా ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి.. ఈ ప్రాజెక్టును బాగుచేయలని కోరుతున్నారు అక్కడి రైతులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..