అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో సక్సెస్ అయిన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు. చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు.
హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌తో భేటీ అయ్యారు. శామ్‌సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి బృందం సందర్శించింది. కాల్‌టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది.
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి తెలిపారు. అలాగే కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, వైస్ చైర్మన్ సొయాంగ్ జూ సహా 25 అగ్ర శ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు అమెరికా పర్యటనలో రూ.31వేల 532 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..