
Chinna Jeeyar Swamy 70th Tirunakshatram: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. త్రిదండి చిన్న జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవం.. యతీంద్ర సప్తతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పారాయణాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, గ్రంథావిష్కరణలు, సేవామూర్తుల సత్కారాలతో ఉత్సవాలు కనులపండువగా సాగాయి. చివరి రోజు 1,001 కలశాలతో శ్రీ కోదండరాముడికి నిర్వహించిన 32వ ఏకోత్తర సహస్ర కలశాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తొలి రోజు: నవంబర్ 8న ప్రారంభమైన ఉత్సవాల్లో తొలిరోజు వేద, సంస్కృత పండితులకు విశిష్ట పురస్కారాలు అందజేశారు. గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్యులకు 36వ జీయర్ పురస్కారం, ఎన్. మకరభూషణం అయ్యంగార్‌కు 37వ జీయర్ పురస్కారం ప్రదానం చేశారు. వేద విజ్ఞాన పరిరక్షణ లక్ష్యంగా ప్రాజెక్ట్ సహస్రను ప్రారంభించారు.
రెండో రోజు: రెండో రోజు సంపూర్ణ సుందరకాండ పారాయణంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆచార్య వైభవం కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామివారి ఆధ్యాత్మిక ప్రస్థానం, సమాజ సేవలను స్మరించుకున్నారు. రామానుజాచార్యుల సమానత్వ సందేశాన్ని వివరించారు.
మూడో రోజు: మూడో రోజు మంగళ తరంగిణి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాలుగు ఆధ్యాత్మిక గ్రంథాలను చిన్న జీయర్ స్వామి ఆవిష్కరించారు. సాయంత్రం వేలాది మంది భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొని ప్రపంచ శాంతిని కాంక్షించారు.
ముచ్చింతల్‌లో చిన్న జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. చిన్న జీయర్ స్వామివారి సమక్షంలో వేలాది మంది భక్తులు పాల్గొన్న ఈ పారాయణం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. గిన్నిస్ ప్రతినిధులు రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని స్వామివారికి అందజేశారు. ఈ ఘనతపై మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
నాలుగో రోజు: నాలుగో రోజు వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన 70 మంది సేవామూర్తులకు సమతా పురస్కారాలు అందజేశారు. సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న 70 మంది మాతృమూర్తులను ప్రత్యేకంగా సత్కరించారు. మహిళల సేవలను గుర్తించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో బాబా బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి మహారాజ్ పాల్గొన్నారు . భూమాత, గోమాత, గంగామాత, భగవద్గీత, భారతమాతలను పూజించడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. పూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఐదో రోజు శ్రీ కోదండరాముడికి 1,001 కలశాలతో 32వ ఏకోత్తర సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేక సంప్రదాయం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని చిన్న జీయర్ స్వామి వివరించారు.
1993లో ఆశ్రమం నుంచి శ్రీరామచంద్రస్వామివారు అదృశ్యమై తిరిగి వచ్చిన సందర్భంగా తొలిసారిగా 108 కలశాలతో అభిషేకం నిర్వహించినట్లు చిన్న జీయర్ స్వామి తెలిపారు. 1995 నుంచి ప్రతి ఏటా 1,001 కలశాలతో అభిషేక సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు. స్వామివారిని తిరిగి ఆశ్రమానికి చేర్చడంలో అప్పటి పోలీస్ అధికారి కోటేశ్వరరావు చేసిన సహాయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన చేతుల మీదుగా అభిషేకం నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది.
యతీంద్ర సప్తతి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న జీయర్ స్వామి పంచసంస్కారాల ద్వారా వైష్ణవ సంప్రదాయాన్ని, భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారని కొనియాడారు. స్వామివారి ఆశయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
మొత్తంగా ఐదు రోజుల యతీంద్ర సప్తతి మహోత్సవాలు ఆధ్యాత్మికత, సేవాభావం, సమానత్వానికి ప్రతీకగా నిలిచాయి. వేద విజ్ఞాన పరిరక్షణ, సేవామూర్తుల సత్కారం, విశ్వశాంతి పారాయణం, కలశాభిషేకంతో వేడుకలు ఘనంగా ముగిశాయి. చిన్న జీయర్ స్వామి చాటిన ధర్మం, సేవ, సమానత్వ సందేశాలు భక్తులకు స్ఫూర్తినిచ్చాయి.
ఈ వార్త కూడా చదవండి.. ముచ్చింతల్‌లో ముగిసిన యతీంద్ర సప్తతి వేడుకలు.. 1,001 కలశాలతో శ్రీరాముడికి అభిషేకం!