దూరం నుంచి చూస్తే పత్తి చేను.. దగ్గరికెళ్తే మత్తెక్కించే వాసన! అసలు మ్యాటర్ ఏంటంటే..?

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సాధారణ పంటల మాటున సాగుతున్న గంజాయి సాగును పోలీసులు ఛేదించారు. సిర్పూర్‌(యు) పరిధిలోని జీర్లఘాట్‌, గుట్టగూడ శివార్లలో మూడు కేసులు నమోదు చేసి 460 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్‌ చేశారు.

దూరం నుంచి చూస్తే పత్తి చేను.. దగ్గరికెళ్తే మత్తెక్కించే వాసన! అసలు మ్యాటర్ ఏంటంటే..?
Ganja Cultivation In Komuram Bheem

Edited By:

Updated on: Sep 05, 2026 | 7:22 PM

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సాధారణ పంటల మాటున సాగుతున్న గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టగా భారీగా గంజాయి మొక్కలు బయటపడ్డాయి. జిల్లాలోని సిర్పూర్‌(యు) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు వేర్వేరు కేసుల్లో మొత్తం 460 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పక్కా సమాచారంతో పోలీసుల నిఘా

బుర్నూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని పొలాల్లో నిషేధిత గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా ఎస్పీ నితికా పంత్‌ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సమాచారం నిర్ధారించుకున్న అనంతరం బుర్నూర్‌ పరిధిలోని జీర్లఘాట్‌, గుట్టగూడ గ్రామాల శివార్లలో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు అనుమానం వచ్చిన ప్రాంతాల్లోని పొలాలను పరిశీలించగా సాధారణ పంటల మధ్య గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

మూడు కేసులు.. నలుగురు అరెస్ట్‌

పోలీసుల తనిఖీల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 460 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిని గెడం లోబాజీ, గెడం జయవంత్‌, కుమ్రా మాధవరావు, పెందోర్‌ సూర్యబానుగా గుర్తించారు. వీరిలో మొదటి ముగ్గురు బుర్నూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని జీర్లఘాట్‌కు చెందినవారు కాగా, పెందోర్‌ సూర్యబాను గుట్టగూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు.

అక్రమ సాగుపై కఠిన చర్యలు

జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఎస్పీ నితికా పంత్‌ స్పష్టం చేశారు. మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా, వాటికి సహకరించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా అనుమానాస్పదంగా గంజాయి సాగు కనిపించినా లేదా మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us