Gadwal Politics: నడిగడ్డ కాంగ్రెస్‌ను అల్లకల్లోలం చేస్తున్న ఎమ్మెల్యేబండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక.. !

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరోసారి నడిగడ్డ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరుతారంటూ జోరుగా ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. దీంతో ఆయనను పార్టీలోకి తీసుకోవద్దు అంటూ హస్తం కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు.

Gadwal Politics: నడిగడ్డ కాంగ్రెస్‌ను అల్లకల్లోలం చేస్తున్న ఎమ్మెల్యేబండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక.. !
Saritha Tirupataiah Bandla Krishnamohan Reddy
Follow us

|

Updated on: Jul 05, 2024 | 8:35 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరోసారి నడిగడ్డ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరుతారంటూ జోరుగా ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. దీంతో ఆయనను పార్టీలోకి తీసుకోవద్దు అంటూ హస్తం కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేరనివ్వకూడదని ఆయన ప్రత్యర్థి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే చేరిక అంశం తుది దశకు చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తుల అగ్గి రాజుకుంది.

నడిగడ్డ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మార్పు వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరే ముహూర్తం ఖరారైనట్లు జరుగుతున్న ప్రచార జోరుతో నడిగడ్డ పాలిటిక్స్ హీటెక్కాయి. చేరిక వార్తల జోరు తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ పార్టీలోని ఆయన ప్రత్యర్థిగా ఉన్న మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ సరితా తిరుపతయ్య జీర్జించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరనివ్వకూడదని… చేరికను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

నిన్న, మొన్నటి వరకు ఈ రాజకీయాలు నడిగడ్డకే పరితమైనా తాజాగా రాష్ట్ర నాయకత్వం దృష్టికి చేరాయి. నిన్న గద్వాల్ లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. సరితా తిరుపతయ్య అనుచరుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కి ఎమ్మెల్యే బండ్ల చేరికకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మరికొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. తమ గళం గట్టిగా వినిపించేందుకు గద్వాల్ హస్తం శ్రేణులు హైదరాబాద్ కు బయలుదేరాయి. ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తూ గాంధీభవన్ కు వెళ్తారని తెలిసింది. మరోవైపు ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని సరితా తిరుపతయ్య దంపతులు కలిశారు. బండ్ల చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే చేరిక అంశంలో సరితా తిరుపతయ్యలకు నచ్చచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే చేరినా, పార్టీ లో మీకు సముచిత స్థానం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది.

అయితే మొదటి నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ఐదు నెలల ముందు వరకు సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ నుంచి జోగుళాంబ గద్వాల్ జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే ఆమె పార్టీ మారడానికి ఎమ్మెల్యే బండ్ల వ్యవహారశైలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ జడ్పీ ఛైర్మన్ గా ఆమె, ఎమ్మెల్యేగా ఈయన ఏ కార్యక్రమానికి వెళ్లిన ఉప్పు, నిప్పులా ఉండేవారు.

తరచూ ఈ ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు, ఇరు గ్రూపుల్లో తగాదాలు నాడు గులాబీ పార్టీని సైతం కలవరపెట్టాయి. ఇక రాజకీయ భవిష్యత్ కోసం అసెంబ్లీ ఎన్నికల కంటే ఐదు నెలల ముందు జడ్పీ ఛైర్ పర్సన్ గా కొనసాగుతూనే హస్తం గూటికి చేరారు సరితా తిరుపతయ్య. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ ఆశించి సక్సెస్ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో నేరుగా ఎన్నికల పోరులో తలపడింది. బీసీ నినాదంతో గద్వాల్ లో రాజకీయ వేడి రాజేసింది. ఎన్నికల్లో అందరూ ఆమె గెలుస్తుందని భావించారు. కానీ ఏడువేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. . నియోజకవర్గంలో ఓటమి చెందినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జెడ్పీ ఛైర్ పర్సన్ పదవీ అలాగే ఉండడంతో నిన్నటి వరకు ఎమ్మెల్యేకు మించి పవర్ సెంటర్ గా మారారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో అధికారులు అందరూ తన మాటే వినాలని మౌఖిక అదేశాలు ఇచ్చారనే టాక్ నడిచింది. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యేను కాదని ఆమె ముఖ్య అతిధిగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలువకపోయినా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేని కాదని ప్రతిరోజూ వందల మంది ప్రజలు ఆమె ఇంటి చుట్టే తిరుగుతున్నారట.

ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో ఎమ్మెల్యేగా కనీస గౌరవం దక్కడం లేదనే భావనలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. అధికారులు, పోలీసులు ఎవరూ మాట వినడం లేదని చర్చ నడుస్తోంది. దీనికి తోడు ప్రత్యర్థి సరితా తిరుపతయ్య పవర్ సెంట్ గా మారుతుండడంతో ఐదేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే ఎమ్మెల్యేగా గెలిచి పెద్దగా ప్రయోజనం ఉండదని ఆలోచనలో ఉన్నారు బండ్ల. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు తోపాటు మరో సీనియర్ మంత్రితో పార్టీలో చేరిక అంశంపై బండ్లతో చర్చలు కూడా జరిపారని తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చారు. అయితే ఇటీవలే నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యకర్తలతో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశం పార్టీ మార్పు అంశమే అని టాక్ నడుస్తోంది. త్వరలోనే పార్టీ మార్పు పై నిర్ణయం ఉంటుందని అనుచరుల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే తాజా ఊహాగానాలపై ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించలేదు. మరోపక్క బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేపు లేదా ఎల్లుండి హస్తం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏదీ ఎమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక వార్తలు నడిగడ్డ కాంగ్రెస్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఎమ్మెల్యే బండ్ల పార్టీలో చేరితే తమ భవిష్యత్ ఏంటి అని గందరగోళంలో ఉన్నారట మాజీ జడ్పీఛైర్ పర్సన్ సరితా తిరుపతయ్య.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..