తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..

తెలంగాణలో కమలం వేగంగా వికసిస్తోంది. ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతంతో పాటు సీట్లను పెంచుకుంటూ రాష్ట్రంలో క్రమంగా బలపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి, కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లారు. దీంతో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో ఉంది కమలం పార్టీ. రాష్ట్రంలో ఇంత వేగంగా విరబూస్తున్న ఈ కమలం తోటకు కాబోయే తోటమాలి ఎవరు? సీఎం పీఠమే లక్ష్యంగా ముందుకు కదులుతోన్న తెలంగాణ బీజేపీ శ్రేణులను నడిపించబోయే కొత్త సారథి ఎవరు? రేసులో ఉన్న నేతల్లో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి?

తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
Telangana Bjp
Follow us

|

Updated on: Jun 17, 2024 | 9:55 PM

తెలంగాణలో కమలం వేగంగా వికసిస్తోంది. ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతంతో పాటు సీట్లను పెంచుకుంటూ రాష్ట్రంలో క్రమంగా బలపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి, కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లారు. దీంతో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో ఉంది కమలం పార్టీ. రాష్ట్రంలో ఇంత వేగంగా విరబూస్తున్న ఈ కమలం తోటకు కాబోయే తోటమాలి ఎవరు? సీఎం పీఠమే లక్ష్యంగా ముందుకు కదులుతోన్న తెలంగాణ బీజేపీ శ్రేణులను నడిపించబోయే కొత్త సారథి ఎవరు? రేసులో ఉన్న నేతల్లో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? 2028లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ.. దానిని సాధించే సత్తా ఉన్న సారథి కోసం వెదుకుతోంది. తెలంగాణలో కమల రథాన్ని ముందుకు దూకించి, అధికార పీఠం దిశగా దూసుకుపోయే సమర్థుల కోసం వేట ప్రారంభించింది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కుర్చీలో కర్చీఫులు వేసే నేతలు ఎక్కువయ్యారు. బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్‌ కోసం నేతల మధ్య పోటీ పెరిగింది. హస్తినలో మకాం వేసి మరీ అధ్యక్ష పదవి కోసం పైరవీలు చేస్తున్నారని సమాచారం. స్టేట్‌ ప్రెసిడెంట్‌ చైర్‌ కోసం బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఈ రేసులో పలువురు నేతలు పోటీ పడుతున్నారు.

ఢిల్లీలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతానికి దక్షిణాదిలో బీజేపీ వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రం.. తెలంగాణ. అందుకే ఈ రాష్ట్రంపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి.. కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లిపోవడంతో.. కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు బూత్ స్థాయిలో సంస్థాగత మార్పులకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి రేసులో అధిష్ఠానం ముందు కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్, డీకే అరుణ సహా పలువురు నేతలు రేసులో ఉన్నారు. వీళ్లలో ఎవరికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందా అనే ఆలోచనలో ఉంది కమలం పార్టీ. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్‌లో పోటీ చేసి పరాజయం పాలైన ఈటలకు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పార్టీ మరో అవకాశం ఇచ్చింది. ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లిన ఈటల.. కేంద్ర మంత్రి పదవి సైతం ఆశించారు. కానీ అది దక్కలేదు. అయితే ఈటలకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారని ఆయన కేడర్ చెప్పుకుంటోంది. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. లోకల్ బాడీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటొచ్చని బీజేపీ అధిష్ఠానం భావిస్తోందట. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.

అసాధ్యం అనేది తన డిక్షనరీలో లేదంటూ తాజాగా కామెంట్‌ చేశారు ఈటల రాజేందర్‌. టీ బీజేపీ చీఫ్‌ రేసులో ఈటల పేరు బలంగా వినిపిస్తున్న వేళ ఆయన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న డీకే అరుణ.. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పైగా రేవంత్ ఇలాకాలో ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చాటి చెప్పారు. దీంతో ఆమె పేరును పార్టీ పరిశీలిస్తోంది. పైగా ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్‌కు, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు డీకే అరుణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనేది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రాజకీయాన్ని తట్టుకుని రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లాలంటే డీకే అరుణే కరెక్ట్ అనే ఆలోచనలో ఉందట పార్టీ అధిష్టానం. ఇక మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావు.. రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సీఎం కేసీఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం.. రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలు. మంచి వాగ్ధాటి కలిగి ఉండడం, ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో తనకు తానే సాటి, తనతో తనకే పోటీ. ఇదే ఇప్పుడు అధిష్ఠానం మదిలో ఆయనను పడేలా చేసింది. పార్టీ అధ్యక్ష రేసులో రఘునందన్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు బీజేపీ నేతల్లో వినిపిస్తున్న టాక్.

ఇక నిజామాబాద్ నుంచి వరుసగా రెండోసారి గెలిచిన ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించి భంగపడ్డారు. ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్‌…ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీ చీఫ్‌ సీటు బీసీలకు ఇచ్చే అవకాశం ఉండడంతో అరవింద్‌ వర్గం బోలెడు ఆశలు పెట్టుకుంది. వీళ్లతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణారెడ్డి సైతం అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్‌రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో పార్టీ పగ్గాలు బీసీకి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కు మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్‌కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తి కరంగా మారింది. టీ బీజేపీ చీఫ్‌ పోస్టు కోసం.. తెర వెనుక మరికొంత మంది నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, చింతల రాంచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖర్, ఆచారి పేర్లు సైతం వినపడుతున్నాయి. వీళ్లలో అధిష్ఠానం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్రాల్లో పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆషాడమాసం తర్వాతే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో..అప్పటిదాకా టీ బీజేపీ చీఫ్‌ కుర్చీ కోసం కుస్తీ తప్పదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..