
చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ గర్భాలయ పునర్నిర్మాణ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం మూల నక్షత్ర యుక్త శుభ ముహూర్తంలో ప్రథమ శిలా స్థాపన పూజ నిర్వహించారు.
ఉదయం 9 గంటల 15 నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్కు చెందిన దాతలు సూరపనేని సునంద, పద్మప్రియ దంపతులు ఈ మహత్తర నిర్మాణానికి ముందుకొచ్చారు. ప్రథమ శిలా స్థాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానాచార్యులు, ప్రధానార్చకుల సూచనలతో వైదిక బృందం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసింది.
ఏకంగా 30 కోట్ల రూపాయలు.. ఆరు నెలల గడువు..!
అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి దాతలు భారీ విరాళాన్ని అందిస్తున్నారు. ప్రధాన గర్భగుడితో పాటు మహంకాళి అమ్మవారి ఆలయం, అల్వేటి మండపం, ప్రాకార మండపాలను సైతం కృష్ణశిలలతో నిర్మించనున్నారు. ఈ మొత్తం నిర్మాణ బాధ్యతకు సంబంధించి సూరపనేని సునంద, పద్మప్రియ దంపతులు 30 కోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నారు. సుమారు ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని దేవస్థానం లక్ష్యంగా నిర్దేశించుకుంది. నాణ్యతలో రాజీ లేకుండా.. ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఈ పునర్నిర్మాణంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. కేవలం నిర్మాణాల రూపురేఖలు మార్చడమే కాకుండా.. బాసర ఆలయానికి ఉన్న ప్రాచీన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని కాపాడుతూ పనులు చేపట్టనున్నారు. శృంగేరి జగద్గురువుల ఆజ్ఞలు, మార్గదర్శకత్వంలో ఆగమ శాస్త్ర నియమాలు, వైదిక విధానాలకు అనుగుణంగా నిర్మాణాలు కొనసాగనున్నాయి. దీంతో ఆధునిక నిర్మాణ హంగులతో పాటు ప్రాచీన ఆలయ సంప్రదాయాల వైభవం కూడా కొనసాగనుంది.
అక్షరాభ్యాసానికి పెట్టింది పేరైన బాసర క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తమ చిన్నారుల భవిష్యత్తుకు అక్షర శ్రీకారం చుట్టేందుకు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో గర్భాలయ పునర్నిర్మాణం ప్రారంభం కావడం భక్తుల్లో ఆనందాన్ని నింపుతోంది. కృష్ణశిలలతో గర్భాలయం, మండపాల నిర్మాణం పూర్తయితే ఆలయ శిల్పకళా సౌందర్యం మరింత ఇనుమడించనుంది.
ఇప్పటికే అక్షరాభ్యాస క్షేత్రంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బాసర.. ఇక కృష్ణశిలల ఆలయ నిర్మాణంతో మరో ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోనుంది. దాతల ఉదారత.. దేవస్థానం ప్రణాళికలు.. ఆగమ శాస్త్ర సంప్రదాయాల సమ్మేళనంగా రూపుదిద్దుకోనున్న ఈ నిర్మాణం.. భవిష్యత్ తరాలకు బాసర ఆలయ చరిత్రలో ఓ ప్రత్యేక గుర్తుగా నిలవనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.